ధన్యోహం ఓ శబరీశా
పల్లవి:
ధన్యోహం ఓ శబరీశా,
నీ శుభరూపం నేటికి చూశా..
ఉత్తుంగ శబరిగిరి శృంగ,
నిత్య నిస్సంగ, మంగళాంగ,
పంపా తరంగ, పుణ్యానుషంగ,
ముని హృదయ జలజ భృంగ!
॥ ధన్యోహం ఓ శబరీశా ॥
చరణం – 1
బ్రహ్మచారినై, భక్తియోగినై,
ద్వంద్వము అన్నది వీడి,
విగతకామినై, మోక్షగామినై,
తాపత్రయమును విడచి,
కన్నెసామినై, కర్మధారినై,
కాలాంబరములు తొడిగి,
నీ దరి చేరితి నీలగిరీశా!
బంధము తెంచితి పన్నగవాసా!
॥ ధన్యోహం ఓ శబరీశా ॥
చరణం – 2
శరణం శరణం భవతరణ,
శబరిగిరీశా అయ్యప్పా!
శుభదం, సుఖదం నీ చరణం,
హరిహరపుత్రా అయ్యప్పా!
అయనరేఖలా సంగమవేళ,
మిథ్యావాదపు మధ్యస్థలిలో,
శూన్య జగతిలో, సూక్ష్మ పరిధిలో,
నికరపు వెలుగుల కాంతిపుంజమై,
సకల చరాచర సృష్టి దీపమై,
మకరజ్యోతిగా వెలిగేది,
నీ మహిమ ఒక్కటే అయ్యప్పా,
ఈ మహికి దేవుడే అయ్యప్ప!
॥ ధన్యోహం ఓ శబరీశా ॥
ముగింపు:
శబరిగిరీశా... ధన్యోహం...
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏