నరక చతుర్దశి రోజున తప్పక చేయాల్సిన శుభకార్యాలు ఇవే!
Naraka Chaturdashi Significance 2025: దీపావళి పండుగ ముందు రోజు నరక చతుర్దశిగా జరుపుకుంటాం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజునే నరక చతుర్దశిగా వ్యవహరిస్తాం. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నరక చతుర్దశి పండుగను జరుపుకుంటాం. తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడు, కర్ణాటకలో నరక చతుర్దశి పెద్ద పండుగ. ఈ సందర్భంగా నరక చతుర్దశి ప్రాముఖ్యత ఏమిటి? నరక చతుర్దశి పండుగ విశిష్టత, పూజా విధానం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
నరక చతుర్దశి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ బహుళ చతుర్దశి తిథి అక్టోబర్ 19, ఆదివారం మధ్యాహ్నం 1.51 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 20వ తేదీన మధ్యాహ్నం 3.44 గంటలకు చతుర్దశి తిథి ముగుస్తుంది. సూర్యోదయంతో పండుగ జరుపుకునే సంప్రదాయం ఉన్నవారు మరుసటి రోజు అంటే అక్టోబర్ 20, సోమవారం ఉదయం నరక చతుర్దశిగా, సాయంత్రం దీపావళి పండుగగా జరుపుకోవచ్చు. కొందరు పండితులు మాత్రం అక్టోబర్ 19, ఆదివారం రోజునే నరక చతుర్దశి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇలా తిథి ద్వయం వచ్చిన ప్రత్యేక సందర్భాల్లో ఇలా రెండు విధాలుగా జరుపుకోవడం సామాన్యమేనని పండితులు చెబుతున్నారు.
నరక చతుర్దశి ఎందుకు జరుపుకుంటారు?
పూర్వం ప్రాగ్జ్యోతిష్య పురాన్ని పాలించే నరకాసురుడనే రాక్షసుడు వరగర్వంతో దేవతలను, రుషులను తీవ్రంగా హింసించేవాడు. రోజు రోజుకి నరకాసురిడి దురాగతాలు పెరిగిపోవడంతో స్వర్గాధిపతి ఇంద్రుడు నరకాసురిడి పీడ నుంచి విముక్తి కలిగించమని శ్రీకృష్ణునికి మొర పెట్టుకుంటాడు. నరకాసురిడికి స్త్రీ వల్ల తప్ప మరెవ్వరి వల్ల మరణం కలగదన్న వరం ఉంటుంది.
నరకాసురిడి సంహరించిన సత్యభామ
నరకాసురునికి ఉన్న వరం గురించి తెలిసిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఆయనపైకి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు స్పృహ తప్పుతాడు. అప్పుడు సత్యభామ ఆయుధాన్ని ధరించి నరకాసురుని సంహరిస్తుంది. ఈ విధంగా నరకాసురిడికి స్త్రీ వల్ల మరణం సంభవిస్తుంది. ఈ వరం నిజం చేయడానికే శ్రీకృష్ణుడు స్పృహ తప్పినట్లుగా నటిస్తాడు. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించిన రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి కాబట్టి ఆనాటి నుంచి నరక చతుర్దశి పండుగను వైభవంగా జరుపుకుంటాం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన నరక చతుర్దశిని ప్రతి ఒక్కరు శాస్త్రోక్తంగా జరుపుకోవాలి. అది ఎలానో చూద్దాం.
నరక చతుర్దశి ఇలా జరుపుకోవాలి!
నరక చతుర్దశి రోజు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం ఆచరించాలి. ఇలా చేయడం వలన శారీరక, మానసిక కల్మషాలు దూరమవుతాయని విశ్వాసం. ఇంటి ముందు అందమైన రంగ వల్లులు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించాలి. కుటుంబంలో అందరూ నూతన వస్త్రాలు ధరించాలి.
పూజా విధానం
ముందుగా పూజామందిరాన్ని గంగాజలంతో శుభ్రం చేసుకోవాలి. అనంతరం ఒక కలశంలో గంగాజలం, కొన్ని పూలు, అక్షింతలు వేసి దేవుని ముందు పెట్టాలి. నరక చతుర్దశి పర్వదినాన నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి, సానుకూల శక్తులు ప్రవేశిస్తాయని విశ్వాసం. ముందుగా గణపతిని పూజించాలి. తరువాత కుల దైవాన్ని, ఇష్ట దైవాన్ని పూజించాలి. అలాగే ఈ రోజు సత్యభామ సమేత శ్రీకృష్ణుని పూజించడం ఆనవాయితీ. అంతేకాకుండా ఈ రోజు మహాలక్ష్మి పూజ చేయడం వల్ల ధనం, సంపద, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వాసం. పూజ పూర్తయ్యాక పరమాన్నం, గారెలు, పులిహోర వంటి ప్రసాదాలు నివేదించాలి. తరువాత బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి.
సాయంత్రం పూజ
నరక చతుర్దశి రోజు సాయంత్రం స్నానం చేసి శుచియై పూజ చేసుకోవాలి. తరువాత నరకాసురిడి పీడ వదిలినందుకు కుటుంబ సభ్యులందరూ బాణాసంచా కాల్చుకోవాలి. ఇలా సంప్రదాయ సిద్ధంగా నరక చతుర్దశి పండుగ జరుపుకున్న తరువాత మరుసటి రోజు దీపావళి పండుగకు అందరూ సిద్ధమవుతారు. మనం కూడా మన సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ నరక చతుర్దశి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుందాం. ఐశ్వర్యలక్ష్మిని ఆహ్వానిద్దాం.
శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.