- ప్రత్యేక పద్దతిలో దీపారాధన - కుటుంబ సభ్యులంతా పాల్గొనాలి!
hantrayodashi : ధన త్రయోదశిని దేశ వ్యాప్తంగా ఎంతో ముఖ్యమైన పర్వదినంగా చూస్తారు. దివ్వెల పండుగ దీపావళి ముందుగా వచ్చే ఈ రోజును చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి ఇంటికి చేరుతుందని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలో ధనత్రయోదశిగా, ఉత్తర భారతంలో ధంతేరాస్గా జరుపుకునే ఈ పండగవేళ లక్ష్మీదేవికి ప్రతిరూపమైన బంగారం కొనుగోలు చేస్తారు. తమ ఆర్థిక స్థోమతను బట్టి, ఎంతో కొంత గోల్డ్ తప్పకుండా కొనాలని జ్యోతిష్యులు చెబుతుంటారు. దీనివల్ల ఇంట్లో ఐశ్వర్యం సమకూరుకుతుందట.
అయితే, ఆ రోజున మరో ముఖ్యమైన పని కూడా చేయాలని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ సూచిస్తున్నారు. అదే దీపం వెలిగించడం. ధనత్రయోదశి రోజున ప్రత్యేకమైన "బలి దీపం" వెలిగించాలని చెబుతున్నారు. దీనివల్ల ఎంతో మంచి జరుగుతుందని, తప్పకుండా ఇంట్లోని వారంతా ఈ దీపారాధనలో పాల్గొనాలని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ ఈ దీపం ఎలా వెలిగించాలి? తర్వాత ఏం చేయాలి? వంటి వివరాలు ఆయన మాటల్లోనే చూద్దాం.
దీపావళి ఎప్పుడు? అక్టోబర్ 20 లేదా 21నా? పండితులు ఏమి చెబుతున్నారు?
ఆశ్వీయుజ మాసంలో బహుళ పక్షంలో వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ఈ రోజుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజున ఇంటి ముందు బలి దీపం వెలిగించాలి.
ఈ దీపం వెలిగిస్తే ఇంటికి ఉన్న దోషాలతోపాటు ఇంట్లో ఉన్నవారందరి దోషాలూ తొలగిపోతాయి.
ఈ దీపాన్ని ఆ రోజు సాయంత్రం పూట ఇంటి పెద్ద వెలిగించాలి.
ఈ దీపం వెలిగించడం కోసం ముందుగా గోధుమ పిండి ప్రమిద తయారు చేసుకోవాలి. గోధుమ పిండి, ఆవు పాలు, బెల్లం తురుముతో దీన్ని తయారు చేసుకోవాలి.
తర్వాత ఈ ప్రమిదను ఇంటి గుమ్మం బయట పెట్టి, అందులో నువ్వుల నూనె పోసి, వత్తులు వేసి దీపం వెలిగించాలి.
దాని ముందు ఒక తమలపాకు పెట్టి, దానిపైన కాస్త బియ్యం, బెల్లం ముక్క పెట్టి నైవేద్యం సమర్పించాలి.
అలాగే రాగినాణెం, గవ్వ ఉంచాలి. రాగి నాణెం దొరక్కపోతే ఒక రూపాయి నాణెం కూడా తీసుకోవచ్చు.
సాయంత్రం వెలిగించిన ఆ బలి దీపాన్ని రాత్రి చీకటి పడేవరకు, వీలైతే నిద్రించే వరకు వెలిగేలా చూడాలి. మర్నాడు కొండెక్కిన ఆ దీపాన్ని, తమలపాకు, బియ్యం, బెల్లం ముక్కను తీసి ఎవరూ తొక్కని చోట వేయాలి. చెట్టు మొదట్లో గానీ, లేదంటే నీటిలో గానీ వేయొచ్చు.
ఇదే విధంగా ఇంట్లోని సభ్యులంతా కనీసం నాలుగు దీపాలు వెలిగించి, వాటిని దానం ఇవ్వాలి.
సహజంగా అందరూ కార్తిక మాసంలో దీపాలు దానం చేస్తుంటారు. అయితే ధన త్రయోదశి రోజున కూడా దానం ఇస్తే మంచిది.
ఇంట్లో బంగారం, వెండి వస్తువులు ఉంటే వాటిని ఆవు పాలతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత మంచి నీళ్లతో కడిగి, పూజా మందిరంలో ఉంచాలి. పూజ తర్వాత వాటిని తిరిగి బీరువాలో పెట్టుకోవచ్చు.
పూజలు ఇలా చేయడం వల్ల అనర్థాలన్నీ తొలగిపోతాయని, గండాలు, అప మృత్యు దోషాలు తొలగిపోతాయని, అనారోగ్యాల బారి నుంచి బయట పడతారు.
అందుకే ఈ ధనత్రయోదశి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ బలి దీపం వెలిగించండి.