సోమవారమే శివారాధన ఎందుకు చేయాలి? శివపురాణంలో దీని గురించి ఏం చెప్పారో తెలుసా?


 

సోమవారం శివపూజ చేస్తే శివానుగ్రహం ఖాయం- మరి శివారాధన ఎలా చేయాలో తెలుసా?

Monday Shiva Aradhana Significance : శివపూజకు ఎంతో ప్రధానమైనది సోమవారం. శివానుగ్రహం పొందడానికి శ్రేష్టమైనదని శాస్త్రం చెబుతోంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుని శిరస్సున ధరించిన శివుణ్ణి సోమవారం పూజించడం వల్ల మనఃకారకుడైన చంద్రుని అనుగ్రహంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని శివ మహాపురాణం చెబుతోంది.ఈ క్రమంలో శివారాధన ఎలా చేయాలి? శివుణ్ణి ఎలా సంతుష్టుని చేయాలి అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దుష్టశక్తులను దునుమాడే రుద్రుడు
శివస్వరూపంలో రుద్ర స్వరూపం ఉగ్రమైనది. అయితే రుద్రుడి రౌద్రం దుష్టశక్తులను దునుమాడుతుంది. సాధుస్వభావులను కాపాడుతుంది. శివార్చనలో శివలింగం ప్రధానం. శివలింగం శివుడికి ప్రతిరూపం. శివుడు అభిషేక ప్రియుడు. అందుకే నిరంతరం శిరస్సున గంగను ధరించి గంగాధరుడయ్యాడు.

పంచభూతాలకు ప్రతీక!
లింగ పురాణం ప్రకారం శివుడు పంచభూతాల్లో వ్యాపించి ఉన్నాడు. అందుకే పంచభూత లింగాలుగా శివుడు ప్రసిద్ధి చెందాడు. శివారాధన చాలా సులభమైనది. కొంచెం మృత్తికతో కానీ సైకతంతో కానీ శివలింగాన్ని రూపొందించుకొని ఆ లింగాన్ని స్వయంభూలింగంగా భావించి పూజించిన శివుడు తృప్తి చెందుతాడు. చెంబుడు నీళ్లతో 'శివ శివా' అంటూ అభిషేకిస్తే చాలు ఆ భోళాశంకరుడు అనుగ్రహించి వరాల జల్లులు కురిపిస్తాడు.

సర్వాంతర్యామి
ఈ ప్రకృతి అంత శివ స్వరూపమే! జలబిందువుల రూపంలో, జ్వలిస్తున్న విస్ఫులింగంలో, శూన్యమైన ఆకాశంలో, అనంతమైన పృథ్విలో, విశ్వవ్యాప్తమైన వాయువులో ఎటు చూసినా శివుడే! అంతా శివలింగ రూపమే!

నిరాడంబరుడు - నిరాకారుడు
శివపూజకు ఏ ఆడంబరాలూ అవసరం లేదు. ప్రకృతి నుంచి లభించే పత్రి, పుష్పం, పండు, నీళ్లు ఇవే శివుడికి ప్రీతిదాయకాలు. 'హరహరా' అంటూ నీటితో అభిషేకిస్తే చాలు, ఎంతో తృప్తిచెంది పాపాలను హరిస్తాడు. బిల్వదళాలనే పట్టువస్త్రాలుగా భావిస్తాడు, జిల్లేడు పూలు అలంకరిస్తే చాలు సంతోషపడతాడు. ఒక్క పండు ఇస్తే జీవితాన్నే సఫలం చేస్తాడు. అందుకే అతణ్ని బోళాశంకరుడంటారు.

ఇదే శ్రేష్టమైన శివపూజ
శివుడి పూజలో పదకొండు సంఖ్య ఎంతో విశిష్టం. శివుడి పూజకు నిర్మలమైన మనసు ఉంటే చాలు, మానస పూజకే శివుడు ప్రసన్నుడవుతాడు. శివుని పట్ల మనసు స్థిరంగా నిలబడాలంటే ముందుగా శివ భక్తి ఉండాలి. భక్తి అంటే కేవలం పూజలు, పునస్కారాలు కాదు. శివునికి మానసికంగా దగ్గర కావడమే. మన కష్ట సుఖాలు శివునితో స్వతంత్రంగా చెప్పుకోగలగాలి. శివునిపై అలగాలి, కోపించాలి. శివుని లాలించాలి, బతిమాలాడాలి, బుజ్జగించాలి. ఇలా శివునితో మానసిక అనుబంధాన్ని పెంచుకోవాలి. అదే నిజమైన శివభక్తి!

వెంటాడే కర్మ ఫలాలు

మన పూర్వజన్మ కర్మ ఫలాలు బాల్యంలో, కౌమారంలో, యౌవనంలో, వార్ధక్యంలో వెంటాడుతుంటాయి. వాటినుంచి తప్పించుకోవడం అందరికీ అంత సులభం కాదు, శివతత్త్వాన్ని చక్కగా తెలుసుకుంటే ఆత్మజ్ఞానం తెలుస్తుంది. పరమేశ్వరుడు లయకారుడని అంటారు. కానీ నిజానికి శివమ్ అనే పదానికి శుభం అనే అర్ధం ఉంది. శివుని సరైన రీతిలో పూజిస్తే కోరినన్ని శుభ ఫలితాలు ఇస్తాడు. సోమవారం శివుని చెంబుడు నీళ్లతో అభిషేకించి, ఒక బిల్వదళం సమర్పించి, నారికేళం, అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే చాలు ఆ శివయ్య సంతృప్తి చెంది తన పరిపూర్ణ అనుగ్రహాన్ని మనపై కురిపిస్తాడు.కావలసిందల్లా భక్తి శ్రద్ధలు మాత్రమే!

చిత్తశుద్ధి ముఖ్యం
'చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!' అని వేమన కవి చెప్పినట్లుగా స్వచ్ఛమైన మనసుతో చేసే పూజ శివ సాక్షాత్కారాన్ని అందిస్తుంది. అందుకు నిదర్శనాలు మన పురాణాలలో ఎన్నో ఉన్నాయి. శివునికి మన మనసు అనే పుష్పాన్ని భక్తితో సమర్పిస్తే చాలు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.

సోమవారం చంద్రుడికి నెలవు. ప్రతీ సోమవారం చంద్రకళాధరుడి పూజ ఐహికా ముష్మిక ఫలదాయకం. భోళాశంకరుని పూజలు ఎలాంటి ఆర్భాటాలు అవసరం లేదు. నిరాకారుడైన శివుని నిరాడంబరంగా పూజిద్దాం. జ్ఞానవైరాగ్యాలను పొందుదాం.

ఓం నమః శివాయ!

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow