Virudhachalam Temple Significance: భారతదేశంలో వెలసిన ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో కాశీ అగ్రస్థానంలో నిలుస్తుంది. అయితే తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనదని తెలుస్తోంది. కాశీలో మరణించిన వారికి ఎలాగైతే మోక్షం లభిస్తుందో, ఈ క్షేత్రంలో మరణించిన వారికి కూడా అలాగే మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఇంతకూ ఈ క్షేత్రం ఎక్కడుంది? ఆ క్షేత్ర విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మరణం కోసమే జీవనం!
'కాశీ నామ్ మరణాం ముక్తిహి' అంటారు. అంటే కాశీ పట్టణంలో మరణించడమే మోక్షదాయకం అని అర్ధం. అందరూ జీవించడం కోసం వేర్వేరు ప్రాంతాల్లో జీవిస్తుంటే కాశీలో మాత్రం మరణించడం కోసం జీవిస్తారు. సరిగ్గా అలాంటి మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రం దక్షిణ భారతంలో మరొకటి ఉంది. ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.
వృద్ధాచలక్షేత్రం
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న వృద్ధాచలక్షేత్రం కాశీకంటే పురాతనమైన పుణ్యక్షేత్రమని తెలుస్తోంది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాథుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన పాపాలు తొలగిపోయి మరణానంతరం తప్పక కైలాసానికి చేరుతారని ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.
వృద్ధ కాశి
తమిళనాడులోని వృద్ధా చలాన్ని వృద్ధ కాశీ అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం వృద్ధ కాశి అని పిలువబడే ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. అందుకే మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఇక్కడ కొలువైన వృధ్ధాంబికను పూజిస్తారు.
తారకమంత్రం
కాశీలో చెప్పినట్లే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృధ్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు.
ఆనంద తాండవం
చిదంబరంలో పరమశివుడు కాళీ మాతతో పోటీ పడి నృత్యం చేస్తే ఇక్కడ ఆనంద తాండవం చేశాడని చెబుతారు. అందువల్ల ఈ క్షేత్రంలో పుట్టినా, గిట్టినా, నివసించినా భగవంతుడిని ప్రార్థించినా మోక్షం లభిస్తుందని చెబుతారు. శివుడు మొదట ఇక్కడ కొండరూపంలో వెలిశాడని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట పఝుమలై అని పిలచేవారు. అటు పై విరదాచలంగా ఖ్యాతి పొందింది.
స్థల పురాణం
పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్టకష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి, స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పాడు. దీంతో ఆ ఊరిపెద్దలంతా కలిసి స్వామి వారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారికి జీవనం ఎలా సాగుతుంది? అన్న అనుమానం మొదలయ్యింది. దీనికి విభాసిత మహర్షి వృద్ధేశ్వర స్వామి వారిపై నమ్మకంతో దేవాలయ నిర్మాణానికి పూనుకుంటే చేసుకొన్న వారికి చేసుకొన్నంతంగా లాభం చేకూరుతుందని చెప్పారు. దీంతో ప్రజలు అయిష్టంగానే ఆ పనికి పూనుకొన్నారు.
ఆకులే వేతనం
దేవాలయ నిర్మాణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన వారికి విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని ఇచ్చేవాడు.
బంగారు నాణేలుగా మారిన ఆకులు
విభాసిత మహర్షి పనివారికి ఇచ్చిన ఆకులు ఆశ్చర్యకరంగా బంగారు నాణేలుగా మారిపోయేవి. ఎవరు ఎంత పని చేశారో అంతకు సమానమైన ఆకులు నాణేలుగా మారేవి. అప్పటి నుంచే 'చేసిన వారికి చేసినంత', 'చేసుకున్నవారికి చేసుకొన్నంత' అనే నానుడి మొదలయ్యిందని చెబుతారు.
మణిముత్తా నదిలో వేసిన నాణేలు తిరువారూరు కొలనులో!
ఒకసారి సుందరర్ అనే శివభక్తుడు ఈ దారి గుండా వెడుతూ ఇక్కడి స్వామివారిని స్తుతించాడు. దీంతో స్వామి వారు సుందరార్కు స్వయంగా 12 వేల బంగారు నాణేలను అందజేస్తాడు. తాను తిరువారూర్ వెళ్లాల్సి ఉందని, తోవలో దొంగల భయం ఉందని సుందరార్ భయపడుతాడు. ఇదే విషయాన్ని శివుడికి చెప్తాడు. దీంతో శివుడు తాను ఈ నాణేలను ఇక్కడే ఉన్న మణిముత్తా నదిలో వేస్తానని సుందరార్ తిరువారూర్ వెళ్లిన తర్వాత అక్కడి కొలనులో తీసుకోవచ్చని చెప్తాడు. ఇందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూర్ వెళ్లి అక్కడ కొలనులో నుంచి 12వేల బంగారు నాణేలను తీసుకొన్నాడని కథనం. అదే విధంగా ఆ నాణేల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటుపై ఆ భక్తాగ్రేసరుడికి ఇచ్చారని చెప్తారు.
5 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత
ఈ ఆలయంలో 5 అంకెకు విశిష్ట స్థానం ఉంది. ఈ ప్రాంగణంలో పూజలందుకొనే మూర్తులు ఐదుగురు. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు. ఇక్కడ స్వామివారికి 5 పేర్లు ఉన్నాయి. అవి విరుధ గిరీశ్వరుడు, పఝమలైనాధార్, విరుద్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృధ్ధ గిరీశ్వరుడు. అంతేకాదు ఈ ఆలయానికి 5 గోపురాలు ఉన్నాయి. అదే విధంగా 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు ఉన్నాయి. వేకువజాము నుంచి రాత్రిదాకా స్వామికి నిర్ణీత సమయంలో 5 సార్లు పూజలు చేస్తారు. స్వామివారి సేవ కోసం 5 రథాలు ఉన్నాయి.
దుర్గాదేవి మహిమ
ఇక్కడ స్వామివారు స్వయంభువుడు. ఇక్కడ శివుడిని ప్రార్థించిన వారికి మన:శ్శాంతి కలగడమే కాకుండా అన్ని రకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెబుతారు. ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే కుజదోషం వంటి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని, వివాహం, సంతానం కలగడం వంటి కోరికలు నెరవేరుతాయని చెబుతారు.
పాతాళ వినాయకుడు
శ్రీ కాళహస్తిలో ఉన్నట్లు ఇక్కడ వినాయకుడు భూతలం నుంచి కిందికి ఉన్న ఆలయంలో ఉంటాడు. ఈ ఆలయంలోని స్వామివారిని సందర్శించడానికి 18 మెట్లు దిగి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. చనిపోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణిముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున చేరుతాయని చెబుతారు. ఈ విరుదాచలంలోని నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిణిలో తేలుతాయని చెబుతారు. ప్రముఖ శైవ క్షేత్రం అరుణాచలంలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.
వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు
ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి. అవి శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ. ఎక్కువగా శివాలయాల్లోనే చూస్తాం. అందులో ఇది ఒకటి. అందుకే ఇక్కడ స్వామివారికి విన్నవించుకున్న కోరికలు త్వరగా తీరుతాయని చెబుతారు.
సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ఠ చేసిన 28 శివలింగాలు
శైవ సిద్దాంతం ప్రకారం ఇక్కడ 28 ఆగమ శాఖలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిద్ధాంతాలకు ప్రతీకగా 28 శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాడని నమ్ముతారు.
పూజోత్సవాలు
ప్రతిరోజూ ఇక్కడ దేవీదేవతలు నిత్యపూజలు ఘనంగా జరుగుతాయి. కార్తీకమాసం, శ్రావణ మాసం, మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. తిరువణ్ణామలైలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికీ ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. దీని వల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.
ఎలా చేరుకోవాలి?
చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలోని కడలూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అత్యంత ప్రాచీనమైన ఈ శైవ క్షేత్రాన్ని మనం కూడా దర్శిద్దాం. మోక్షాన్ని పొందుదాం!
ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.