శతాబ్దాల చరిత్ర - సూర్యుడు తన సతీసమేతంగా వెలసిన ఏకైక ఆలయం తెలుసా?


 Suryanar Kovil Temple : నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ప్రపంచానికి వెలుగులు పంచుతూ తన కిరణాలతో జాతిని జాగృతం చేసే సూర్యుని ఆరోగ్యప్రదాతగా భావించి పూజిస్తాం. నవగ్రహ స్తోత్రాన్ని కూడా 'ఆదిత్యాయ అంటూ సూర్యదేవుని ప్రార్ధిస్తూనే మొదలు పెడతాం. అలాంటి సూర్య భగవానునికి మన దేశంలో ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. వాటిలో అరసవెల్లి, కోణార్క్ వంటివి బాగా ప్రసిద్ధి చెందినవి. అయితే తమిళనాట వెలసిన ఒక సుప్రసిద్ధ సూర్య దేవాలయం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

సూర్యనార్ కోవిల్
సూర్యభగవానుడు ఇతర నవగ్రహాలలో కలిసి ప్రతిష్ఠితమైన ఉన్న దివ్యక్షేత్రం సూర్యనార్ కోవిల్. ఈ క్షేత్రం తమిళనాడులో టెంపుల్ సిటీ గా పేరొందిన కుంభకోణంకు అతి సమీపంలో వెలసి ఉంది. ఇక్కడ సూర్యుడు సతీసమేతంగా వెలసి ఉండడం విశేషం. 11 వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ విశేషాలు, స్థలపురాణం గురించి తెలుసుకుందాం.

స్థల పురాణం
బ్రహ్మాండ పురాణంలో వివరించిన ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం కాలవ ముని అనే యోగి కుష్టు వ్యాధితో బాధ పడుతుండేవారు. తనకు ఆ వ్యాధి నుంచి విముక్తి కలిగించమని ఆ ముని నవగ్రహాలను ప్రార్ధించాడు. ముని ప్రార్థనలకు సంతసించిన నవగ్రహాధిపతులు కాలవమునికి కుష్టు వ్యాధి నుంచి విముక్తి కల్పించారు.

బ్రహ్మదేవుని ఆగ్రహం
నవ గ్రహాధిపతులు కాలవమునికి కుష్టు వ్యాధి నుంచి విముక్తి కలిగించడం బ్రహ్మకు ఆగ్రహం కలిగించింది. మానవులు చేసే మంచి, చెడులు సంబంధించిన ఫలితాలు ఇవ్వడమే గ్రహాల పని! అంతకు మించి కర్మయోగానికి విరుద్ధంగా గ్రహాలు ప్రవర్తించకూడదని బ్రహ్మ ఆగ్రహం వ్యక్తం చేసాడు. పరిధిని అతిక్రమించి ప్రవర్తించిన నవగ్రహాలను బ్రహ్మ శాశ్వతంగా భూలోకంలో శ్వేతపుష్పాల అటవీ ప్రాంతానికి వెళ్లిపొమ్మని శపిస్తాడు.

పరమేశ్వరుని కోసం తపస్సు చేసిన నవగ్రహాలు
బ్రహ్మ దేవుని శాపం మేరకు నవగ్రహాలు భూలోకంలోని శ్వేత పుష్పాల అటవీ ప్రాంతానికి చేరుకొని అక్కడ శివుని కోసం తపస్సు ఆచరిస్తాయి.

నవగ్రహాలకు శివ సాక్షాత్కారం
నవగ్రహాలు చేసిన తపస్సుకు సంతోషించిన పరమేశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు. నవగ్రహాలను అనుగ్రహించిన భోళాశంకరుడు వారికి శాపవిముక్తిని కలిగిస్తాడు.

నవగ్రహాలకు మహా శక్తులు అనుగ్రహించిన శివుడు
శివుడు నవగ్రహాలు తనను ఎక్కడైతే పూజించాయో అక్కడ వారికి మహాశక్తులను ప్రసాదించాడు. ఆనాటి నుంచి ఆ ప్రాంతానికి వచ్చి ఎవరైనా తమకు కలిగిన గ్రహపీడలను, బాధలను తొలగించమని నవగ్రహాలను ప్రార్ధిస్తే వారికి ఆ బాధల నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు.

ఆలయ విశేషాలు
సూర్యనార్ కోవిల్​లో నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలున్నాయి. ప్రధాన దైవమైన సూర్యుడు మాత్రం తన ఇద్దరు భార్యలైన ఛాయా, ఉషాదేవితో కలిసి వెలసి ఉండడం విశేషం. సాధారణంగా సూర్యదేవుడు అంటే తీక్షణమైన కిరణాలతో ఉండడం సహజం. కానీ సూర్యనార్ కోవిల్ ఇందుకు భిన్నంగా సూర్యుడు మందహాసంతో రెండు చేతుల్లో తామర పుష్పాల ధరించి, భక్తులను ఆశీర్వదిస్తున్న భంగిమలో దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామి వివాహ వేడుకల్లో ఉండడం మరో విశేషం!

ఇతర ఆలయాలు
ఆలయ ప్రాంగణంలో ఇతర నవగ్రహాలకు కూడా ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది. సూర్య భగవానుని ఆలయానికి ఎదురుగా బృహస్పతి ఆలయం ఉంటుంది. అయితే ఇక్కడ నవగ్రహాలకు వాహనాలు మాత్రం కనిపించక పోవడం ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలో విశ్వనాధ, విశాలాక్షి, నటరాజ, శివగామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను కూడా భక్తులు దర్శించుకోవచ్చు.

ఆలయ చరిత్ర
క్రీ.శ. 11 వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. చోళ రాజైన కుళోత్తుంగ చోళ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అనంతరం విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది.

పూజోత్సవాలు
ప్రతి ఏడాది 'తాయ్' తమిళ మాసంలో, అంటే తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసంలో జరిగే రథసప్తమి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం రథసప్తమి నుంచి సూర్యుని రథం దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈ క్షేత్రంలో 10 రోజుల పాటు రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. అలాగే ప్రతి తమిళ మాసం ఆరంభం సమయంలో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. రథసప్తమి సందర్భంగా జరిగే మహాభిషేకం కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటారు.

గ్రహశాంతి పూజలు
ప్రత్యేకించి ఈ క్షేత్రంలో నవగ్రహాలకు ఆలయాలు ఉన్నాయి కాబట్టి భక్తులు తమ నవగ్రహ దోషాల నుంచి పరిహారానికి జరిపే శాంతి పూజల కోసం ఈ ఆలయానికి వస్తుంటారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు 12 ఆదివారాలు ఈ ఆలయంలోనే బస చేసి సూర్యనారాయణ స్వామిని ఆరాధించి, తమ సమస్యల నుంచి విముక్తి పొందుతుంటారు. నవగ్రహ శాంతి పూజలలో భాగంగా నాడీ పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్యునికి అర్చనలు మొదలగునవి విశేషంగా నిర్వహిస్తుంటారు.

తులాభారం
సూర్యనార్ కోవిల్ కు విచ్చేసిన భక్తులు తమ సమస్యల నుంచి ఉపశమనం పొందాక మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ! ఇందులో భాగంగా భక్తులు తమ బరువుకు సమానమైన వ్యవసాయ ఉత్పత్తులు, సూర్యునికి ప్రీతికరమైన బెల్లం, గోధుమలు వంటివి తులాభారంగా సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ప్రతిరోజూ ఇక్కడ సూర్యునికి ప్రీతికరమైన చక్కెర పొంగలిని భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు.

అత్యంత శక్తివంతమైన సూర్య నవగ్రహ దేవాలయాలలో ఒకటిగా భాసిల్లుతున్న సూర్యనార్ కోవిల్ ను మనం కూడా దర్శించుకుందాం. గ్రహ దోషాల నుంచి ఉపశమనం పొందుదాం.

ఓం ఆదిత్యాయ నమః

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow