Vimana Venkateswara Swamy Story: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమల భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు విచ్చేస్తుంటారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రదక్షిణ మార్గంలో ఉన్న విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకోకుంటే తిరుమల యాత్ర అసంపూర్ణమే అని అంటారు. ఈ క్రమంలో ఆనందనిలయంలోని ప్రధాన దైవంతో సమానమైన మహత్యం కలిగిన విమాన వెంకటేశ్వర స్వామి మహిమ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
విమాన వేంకటేశ్వరస్వామి మహత్యం!
వ్యాసమహర్షి రచించిన స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలోని వేంకటాచల మహత్యం శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమలను వివరిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానాలు కూడా వచన రూపంలో దీనిని ప్రచురించాయి. ఇందులోనే విమాన వేంకటేశ్వరస్వామి గురించిన ప్రస్తావన కూడా ఉంది. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయమైన ఆనందనిలయం మీద ఉత్తర దిశగా పైన ఉండే వేంకటేశ్వరస్వామి విగ్రహమే విమాన వేంకటేశ్వరస్వామి విగ్రహం. పురాణాల ప్రకారం ఆనంద నిలయంలోని ధ్రువ మూర్తికి ఉన్న మహాత్యమే విమాన వేంకటేశ్వర స్వామికి కూడా ఉంటుందని అంటారు. ఏ కారణం చేతనైనా శ్రీవారి దర్శన భాగ్యం లభించని వారు విమాన వేంకటేశ్వరస్వామిని దర్శిస్తే శ్రీవారిని దర్శించిన ఫలితమే లభిస్తుందని అంటారు.
విమాన వేంకటేశ్వరస్వామి విగ్రహం ఎక్కడ ఉంటుంది?
తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ విమానంపై, వాయవ్య దిక్కున ఒక చిన్న మందిరం వెలుగును విరజిమ్ముతు ప్రకాశిస్తూ ఉంటుంది. వెండి మకరతోరణంతో అలంకరించిన ఆ మందిరంలో శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి వెలసి ఉన్నారు. విమాన వేంకటేశ్వర స్వామికి ఎడమవైపు గరుత్మంతుడు, కుడివైపున హనుమంతుడు సేవ చేస్తూ ఉంటారు.
విమాన వేంకటేశ్వరుని ఎవరు ప్రతిష్ఠించారు?
విమాన వేంకటేశ్వరుని ప్రతిష్ఠాపన తొండమాన్ చక్రవర్తిచే జరిగినదని వేంకటాచల మహాత్మ్యం తెలిపింది. 1982లో ఆనందనిలయ విమానంకు బంగారుపూత పూస్తున్నప్పుడు విమాన వేంకటేశ్వరుణ్ణి గుర్తుపట్టడానికి వెండి మకరతోరణం పెట్టించి, భక్తులు సులభంగా గుర్తించడానికి వీలుగా బాణం గుర్తును ఏర్పాటు చేయడం జరిగింది.
విమాన వేంకటేశ్వర స్వామి మహత్యం
విమాన వేంకటేశ్వర స్వామి వారు స్వయంగా శ్రీవేంకటేశ్వరస్వామి మూలమూర్తిని పోలిన రూపంలో, ఎంతో పవిత్రత కలిగి ఉండడం విశేషం. ఈ స్వామి విమానంపై విరాజిల్లుతున్నందునే ఈయన్ను "విమాన వేంకటేశ్వరుడు" అని వ్యవహరిస్తారు. విమాన వేంకటేశ్వర స్వామి వారి దర్శనం, గర్భాలయంలోని స్వయంభూ శ్రీవారి దర్శనంతో సమానమనే విశ్వాసం బలంగా ఉంది. ఒకవేళ మూలమూర్తిని దర్శించలేకపోయినా, ఈ స్వామివారి దర్శనం వల్ల యాత్రా ఫలితం సంపూర్ణంగా లభిస్తుందని భక్తుల నమ్మకం.
నాడు - నేడు
ప్రస్తుత కాలంలో ఆనంద నిలయంలో శ్రీవారి దర్శనంలో మార్పులు చేర్పులు జరిగాయి కానీ గతంలో భక్తులు ముందుగా విమాన వేంకటేశ్వరుని దర్శించిన తరువాతే మూలమూర్తిని దర్శించేవారు. నానాటికి భక్తుల సంఖ్య పెరగడం వల్ల ప్రస్తుతం గర్భాలయంలో మూలమూర్తినే భక్తులు ముందుగా దర్శించుకుంటున్నారు. అయితే శ్రీవారి దర్శనం తరువాత ప్రదక్షిణ చేస్తూ భక్తులు విమాన వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేయడం ఇప్పటికీ ప్రధాన ఘట్టంగా కొనసాగుతోంది.
వ్యాస రాయల కాలంలో ప్రాధాన్యం
శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రముఖ ద్వైత వేదాంత పండితులు శ్రీ వ్యాసతీర్థులుగా పిలవబడే వ్యాసరాయలు తిరుమలలో 12 సంవత్సరాల పాటు సేవలందించారు. కృష్ణదేవరాయుడి 'కుహూ యోగం' అనే కాలసర్ప దోషాన్ని నివారించేందుకు ఆయన విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించి తపస్సు చేశారు. ఈ పుణ్యకాలంలో విమాన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన వేద పారాయణలు, భక్తి కార్యక్రమాలు, అర్చనలు అత్యంత ప్రాముఖ్యత పొందాయి. ఇప్పటికీ మధ్వ పండితులు విమాన వేంకటేశ్వరుడి ఎదుటే కూర్చొని వేదపారాయణ చేస్తున్నారు.
విమాన వేంకటేశ్వరుని దర్శనఫలం
తిరుమల శ్రీవారిని దర్శించిన తరువాత విమాన వేంకటేశ్వరుని కూడా దర్శించుకుంటే జన్మాంతర పాపాలు తొలగిపోతాయని, సర్వశుభాల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అందుకే విమాన వేంకటేశ్వరస్వామి దర్శనానికి అంతటి ప్రాధాన్యత ఉంది. మనం కూడా తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు విమాన వేంకటేశ్వరస్వామిని తప్పకుండా దర్శించుకుందాం. సకల శుభాలను పొందుదాం!