"తులసి చెట్టు" అసలు పేరు వృంద - రాక్షసుడి భార్య! - ఆమెకు పూజలెందుకు?

 Tulasi plant Story


: తెలుగు లోగిళ్లలో తెలతెలవారుతుండగానే మహిళలు తలస్నానం చేసి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా పూజిస్తారు. తమ సౌభాగ్యానికీ గుర్తుగా భావిస్తారు. అయితే తులసి అసలైన పేరు వృంద అనీ, ఆమె ఒక రాక్షసుడి భార్య అనీ మీకు తెలుసా? అలాంటి తులసి ప్రతి ఇంట్లోనూ ఎందుకు ఉంటుంది? మహిళలు నిష్టతో ఎందుకు పూజిస్తారు? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఇదీ కథ :

తులసి మొదటి పేరు వృంద. ఆమె "కాలనేమి" అనే రాక్షసుడి కూతురు. అయితే ఆమె మాత్రం విష్ణు మూర్తి భక్తురాలు. ఎంతో అణకువతో ఉండేది. వృంద పెరిగి పెద్దైన తర్వాత జలంధరుడు అనే రాక్షసుడితో పెళ్లి జరిగింది. ఇతను శివుడి మూడో కంటి నుంచి వచ్చిన అగ్నిలో నుంచి పుట్టాడు. ఆ తర్వాత అసురుల గురువు శుక్రాచార్యుని వద్ద విద్య నేర్చుకుని, రాక్షసులకు రాజు అయ్యాడు.

నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు? - అసలు కారణం మీకు తెలుసా?

పెరిగిన శక్తి :

తన భార్య వృంద భక్తి, ఆమె పవిత్రత వల్ల జలంధరుడి శక్తి చాలా పెరిగింది. దీంతో ఇక తనను ఓడించేవారు దేవుళ్లలో కూడా లేరని విర్ర వీగడం మొదలు పెట్టాడు. చివరకు ఆ గర్వంతో మహా శివుడి మీదకు యుద్ధానికి వెళ్లాడు. అలా ఇద్దరూ భీకర యుద్ధం చేస్తుండటంతో ఇతర దేవతలు భయంతో విష్ణువు వద్దకు పరిగెత్తారు. ఆ రాక్షసుడిని వధించాలని మొర పెట్టుకున్నారు. ఆ సమయంలో తన భక్తురాలైన వృంద భర్తను చంపడానికి తటపటాయించాడు. పలు ఆలోచనల తర్వాత జలంధరుడి రూపంలోకి మారిపోయిన విష్ణుమూర్తి వృంద వద్దకు వెళ్లాడు. కాసేపు తర్వాత వచ్చిన వ్యక్తి తన భర్త కాదని వృంద తెలుసుకుందట. ఆ విదంగా ఆమె పాతివృత్యానికి భంగం కలగడంతో జలంధరుడి శక్తి తగ్గిపోయిందట. దాంతో పరమేశ్వరుడు అతడిని అంతం చేశాడట.

విష్ణు మూర్తి వివాహం :

పాతివృత్యానికి భంగం కలగడంతోపాటు జలంధురుడు చనిపోవడంతో వృంద తన జీవితాన్ని చాలించాలని నిర్ణయించుకుందట. ఆ విషయం తెలుసుకున్న విష్ణు మూర్తి, ఆమెకు వరం ప్రసాదించాడట. మహా సాధ్వి అయిన నిన్ను దేవతలతోపాటు భూలోకంలో కూడా నిత్యం పూజిస్తారని చెప్పాడట. ఆ విధంగా వృంద తులసిగా మారి భూ లోకంలో అందరి పూజలూ అందుకుంటోందట.

అదేవిధంగా భక్తులు తనకు చేసే పూజల్లో తులసికీ వాటా ఉంటుందని చెప్పిన విష్ణుమూర్తి, సంవత్సరానికి ఒకసారి ఆమెను వివాహం చేసుకుంటానని కూడా ప్రకటించాడట. అందుకే తులసిని సౌభాగ్యానికీ, అభివృద్ధికీ ప్రతీకగా పూజిస్తారట. ఇదే విధంగా మరో కథ కూడా ఉంది. దాని ప్రకారం, లక్ష్మీదేవే తులసిగా భూ లోకంలో అవతరించిందని చెబుతారు. శివ పురాణంతోపాటు పద్మ, స్కంద పురాణాల్లో ఈ విషయం పేర్కొన్నట్టు పండితులు చెబుతుంటారు.

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow