కళ్యాణ, సంతాన ప్రాప్తి కలిగించే 'అట్లతద్ది'- పూజలో '11'కు ఉన్న ప్రాముఖ్యత ఇదే!


 Atla Tadde Festival 2025 : అచ్చమైన తెలుగు వారి పండుగ అట్లతద్ది. ఈ పండుగను ముఖ్యంగా పెళ్లి కావాల్సిన కన్నె పిల్లలు ఆచరిస్తారు. దీనికే మరో పేరు ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని అంటారు. వివాహం కావాల్సిన అమ్మాయిలు మంచి భర్త కోసం గౌరీదేవిని పూజించే పండుగ ఇది. ఈ సందర్భంగా అట్లతద్ది ఎప్పుడు? ఆ రోజు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? ఉయ్యాలా ఎందుకు ఊగుతారు? అనే విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అట్లతద్ది ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ బహుళ తదియ రోజున అట్లతద్ది పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 09, గురువారం రోజు ఆశ్వయుజ బహుళ తదియ. అందుకే ఈ రోజునే అట్లతద్ది జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు గౌరీ పూజకు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శుభ సమయం.

అట్లతద్ది విశిష్టత
స్కాంద పురాణం ప్రకారం నారదుని సలహా మేరకు శివుని భర్తగా పొందడానికి గౌరీదేవి కూడా అట్లతద్ది వ్రతం ఆచరించినట్లుగా తెలుస్తోంది. కన్నెపిల్లలు మంచి భర్త కోసం, స్రీలు సౌభాగ్యం కోసం చేసుకొనే వ్రతమిది. ఈ పూజ చంద్రారాధన ప్రధానమైన పూజ కాబట్టి దీనిని చంద్రోదయ ఉమా వ్రతమని కూడా అంటారు. చంద్రారాధన ప్రధానం అయినందున చంద్రకళల్లో కొలువైవున్నశక్తి, అమ్మవారి అనుగ్రహం చేత స్రీల సౌభాగ్యం పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం.

అట్లతద్ది వ్రత విధానం
అట్లతద్దికి ఒకరోజు ముందు అమ్మాయిలు కాళ్లు, చేతులకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు మామిడాకులతో తోరణాలు కడతారు. ఇక అసలైన అట్లతద్ది పండుగ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి అమ్మాయిలు తలారా స్నానం చేసి సూరీడు రాకముందే చద్దన్నం, గోంగూర పచ్చడి పెరుగుతో తింటారు. ఇక రాత్రి చంద్రోదయం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి.

గౌరీ పూజ
ఇంటికి తూర్పుదిక్కున మంటపము ఏర్పాటుచేసిన గౌరీదేవి పూజ చేయాలి. గౌరీదేవిని పుష్ప మాలికలతో అలంకరించి, ముందుగా దీపారాధన చేసి వినాయక పూజ చేయాలి. తరువాత గౌరీదేవిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. అమ్మవారికి కొబ్బరికాయ, అరటిపండ్లు, వడపప్పు, పానకం వంటి నైవేద్యాలు సమర్పించాలి.

చంద్రోదయ పూజ
సూర్యాస్తమయం కాగానే స్నానం చేసి సాయంత్రం చంద్ర దర్శనం చేసి, తిరిగి గౌరీపూజ చేయాలి. అమ్మవారికి 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. మనగళహారతి ఇచ్చి నమస్కరించుకోవాలి.

ముత్తైదువులకు వాయనం ఎలా ఇవ్వాలి
అట్లతద్ది పూజ చేసుకున్న వారు ముత్తైదువులకు అలంకారము చేసి, 11 అట్లు, 11 ఫలాలు వాయనముగా సమర్పించి, నల్లపూసలు, లక్కకోళ్లు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి తాము కూడా భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి.

11 సంఖ్యకు ప్రాధాన్యం
అట్లతద్ది పూజలో భాగంగా అమ్మాయిలు 11 అట్లు వాయనంగా ఇవ్వాలి. 11 సార్లు ఉయ్యాల ఊగాలి. 11 రకాల ఫలాలను తినాలి. 11 సార్లు తాంబూలం వేసుకోవాలి. ఇలా అన్నీ 11 సార్లు చేయడం ఈ వ్రతంలోని విశేషం. అయితే కొంతమంది 9 లేదా 10 సంఖ్యను కూడా పాటిస్తారు. అది వారి వారి ఇంటి ఆనవాయితీని బట్టి ఉంటుంది.

అట్లే ఎందుకు నైవేద్యం పెట్టాలి?
అట్లతద్ది రోజు గౌరీదేవికి అట్లు నైవేద్యంగా పెట్టడం వెనుక జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన రహస్యం ఉంది. అదేమిటంటే నవగ్రహాలలోని కుజుడుకి అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై వివాహంలో, సంతానాన్ని పొందడంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన దాన్యాలు కాబట్టి గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. అట్లతద్దిలో వాయనమిచ్చే అట్ల'లో ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం దాగిఉంది.

కర్వా ఛౌత్
అట్లతద్ది పండుగనే ఉత్తరభారత దేశంలో 'కర్వా ఛౌత్' అనే పేరుతో జరుపుకుంటారు.

రానున్న అట్లతద్ది పండుగ రోజు మనం కూడా గౌరీ దేవిని పూజించి సకల సౌభాగ్యాలను పొందుదాం.

ఓం శ్రీ గౌరీ దేవ్యై నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow