Thiru Uthirakosamangai Temple : తమిళనాడులోని ఒక కుగ్రామం. ఈ ప్రాంతంలోనే మొదటిసారి శివాలయం వెలసిందంట! రామేశ్వరం నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరి పేరు "తిరుఉత్తర కోసమాంగై". మధురై వెళ్లే దార్లో వస్తుంది ఈ ప్రదేశం. ఈ ఊరిపేరు పలకడం కొంచెం కష్టమే.
పరమేశ్వరుని సొంత ఊరు
మనందరికీ సొంత ఊరు ఉన్నట్టే పరమేశ్వరుడికి కూడా సొంత ఊరు ఉంది. శివాలయం మొట్టమొదట వెలిసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. శివభక్తురాలైన మండోదరి శివుడ్ని ప్రార్ధించి "నాకు ఒక గొప్ప శివభక్తుడ్ని భర్తగా ప్రసాదించు ఈశ్వరా!" అని వేడుకుంటే తన భక్తుడైన రావణబ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
మొగలి పూజ చేసే ఏకైక శివాలయం
గతంలో శివుడు ఇచ్చిన శాపం ప్రకారం మొగలిపువ్వు శివ పూజకు పనికిరాదు. అందుచేత ఏ ఇతర శివాలయాలలోనో మొగలిపువ్వు శివపూజలో ఉపయోగించరు. కానీ ఏ దేవాలయంలో కూడా శివ పూజకు ఉపయోగించని మొగలిపువ్వు ఇక్కడ మాత్రమే స్వామి వారికి అలంకరించడం విశేషం.
ఆలయ విశేషాలు
20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయ దర్శనం మన పూర్వజన్మ సుకృతం. ఆలయ ప్రాంగణంలో 3000 సంవత్సరాల క్రితంనాటి రేగిపండు చెట్టు ఉంది. గర్భాలయంలో శివుడు మూడు రూపాలలో దర్శనమిస్తాడు. శివలింగ రూపంలో, మరకత నటరాజ రూపంలో, స్పటిక లింగం లో శివుడు ఇక్కడ దర్శనమివ్వడం విశేషం.
శివలింగం
గర్భాలయంలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అతి ప్రాచీనమైన ఈ శివలింగ దర్శనం అమోఘం! అపూర్వం.
మరకత నటరాజస్వామి
అలాగే గర్భాలయంలో శివుడు నటరాజ రూపంలో వెలసిన 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడింది. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ మరకతం నుంచి వచ్చే ప్రకంపనలను సాధారణంగా మనం తట్టుకోలేం. అందుకే స్వామివారిని ఎప్పుడూ విభూది, గంధపు పూతతో కప్పి ఉంచుతారు. శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంరోజు మాత్రమే స్వామి నిజరూప దర్శనం ఉంటుంది.
స్పటిక లింగ అభిషేకం
ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి స్పటిక లింగానికి వైభవంగా అభిషేకం జరుగుతుంది. అభిషేకం తరువాత స్ఫటిక లింగాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తారు.
వారాహి అమ్మవారు
ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు వారాహి రూపంలో వెలిశారు. పరమ శివుని దర్శనం కోసం వచ్చే అమ్మవారికి కూడా దర్శించుకుంటారు. ఇక్కడ భక్తులు పసుపు కొమ్ములు ఆలయ ప్రాంగణంలోనే నూరి, ముద్ద చేసి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం విశేషం.
దర్శనఫలం
ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన తిరుఉత్తర కోసమాంగై ఆలయం తప్పక దర్శించాల్సిన క్షేత్రం. ఈ క్షేత్ర దర్శనం ఇహలోకంలో ఆరోగ్య ఐశ్వర్యాలను, పరలోకంలో మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. రామేశ్వరం యాత్రకు వెళ్లే యాత్రికులు తప్పకుండా ఈ క్షేత్రాన్ని కూడా దర్శించుకుంటారు.
ఎలా చేరుకోవాలి?
దేశవ్యాప్తంగా రామేశ్వరం చేరుకోడానికి రైలు, బస్సు, విమాన సౌకర్యాలున్నాయి. రామేశ్వరం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో మధుర వెళ్లే దారిలో వచ్చే తిరుఉత్తర కోసమాంగై చేరుకోడానికి మెరుగైన రవాణా సౌకర్యాలున్నాయి.
మనం కూడా శివుని సొంత ఉరికి వెళ్లి అపురూపమైన ఈ శివాలయాన్ని దర్శించుకుందాం. తరిద్దాం.
ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.