conch shells blown : హిందూ సంప్రదాయంలో ఎన్నో విశిష్టతలు కనిపిస్తాయి. అలాంటి వాటిలో శంఖం ఊదడం ఒకటి. ఇది చాలా పురాతన సంప్రదాయం. ఇది కేవలం శబ్దం చేసే వస్తువు కాదు, ఆధ్యాత్మికతకు చిహ్నంగా భావిస్తారు. దేవాలయాల్లో, ప్రత్యేకంగా నిర్వహించే పూజల్లో శంఖాన్ని పూరించడం చూస్తూనే ఉంటాం.
శంఖం కథ :
హిందూ ఆధ్యాత్మికతలో శంఖానికి విశేష ప్రాధాన్యం ఉంది. దీన్ని పవిత్రతకు చిహ్నం భావిస్తారు. శుభాలకు సూచికగా పరిగణిస్తారు. అలాంటి శంఖం అమృతం కోసం పాల సముద్రాన్ని మదిస్తున్న సమయంలో ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. దాన్ని విష్ణుమూర్తి అందుకున్నాడు. శంఖం పేరుకు ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది. శం అంటే "మంచి" ఖం అంటే "నీరు" అని అర్థం. అంటే జలాన్ని పావనం చేస్తుందని అర్థమట! "శంఖంలో పోస్తేనే తీర్థం" అనే మాట ఇలా పుట్టిందేనంటారు.
ఎన్నో రకాలు :
శంఖాల్లో చాలా రకాలున్నాయి. ఆకారం, సైజు, లక్షణాలు బట్టి వీటి పేర్లు ఉంటాయి. అందులో లక్ష్మీ, మధ్యమావర్త, కామధేను, గోముఖ, దేవ, గరుడ, సుఘోష, రాక్షస, మణిపుష్పక, శని, కేతు, కూర్మ, రాహు వంటి పేర్లున్నాయి. శంఖం ఇంట్లో ఉంటే నెగెటివ్ ఎనర్జీ దరిదాపులకు కూడా రాదని భక్తులు నమ్ముతారు.
పవిత్రతకు చిహ్నం :
- పురాణాలు, శాస్త్రాల ప్రకారం శంఖాన్ని పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు
- శంఖం ఊదడం వల్ల చుట్టూ ఒకరకమైన అధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. పరిసరాలు ప్రసన్నంగా మారిపోతాయని, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు
- పూజలు వంటి కార్యక్రమాల ప్రారంభించడానికి ముందు శంఖం ఊదితే, ఆ ప్రదేశం దైవ సేవకు అనుకూలంగా మారుతుందని భావిస్తారు.
- అంతేకాకుండా పవిత్రమైన ఆరంభాన్ని శంఖనాదం సూచిస్తుందట
దేవతలకు ఆహ్వానం :
- శంఖం ఊదడం అన్నది కేవలం శబ్దం చేయడం మాత్రమే కాదు, ఆ ధ్వని దేవతలకు పిలుపు వంటిదని చెబుతారు
- ఆధ్యాత్మిక ఆనందాన్ని రెట్టింపు చేయడానికి, భక్తి భావాన్ని పెంచడానికి శంఖం తోడ్పడుతుంది
- శంఖం ధ్వనిస్తే వాతావరణంలోని రాజసిక, తామసిక శక్తులు తొలగిపోతాయని విశ్వసిస్తారు
- దీంతో శాంతి, పవిత్రత వంటి సాత్విక శక్తులు పెరుగుతాయని, ఇవి శుభకరమైనవని భావిస్తారు
ఆరోగ్యానికీ మేలు :
- శంఖం ఊదితే శారీరక, మానసిక సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది
- లంగ్స్ పనితీరు మెరుగుపడి, శ్వాసక్రియ బాగుంటుంది
- ఊపిరితిత్తులతోపాటు ముఖం, కడుపులోని కండరాలు బలపడతాయి
- శంఖం ఊదడం వల్ల బ్రెయిన్ కూడా చురుగ్గా మారుతుంది. ఈ విధంగా శరీరానికి మంచి వ్యాయామం కలుగుతుంది
- మనసులోని రజో, తమో గుణాలు తగ్గిపోయి సత్వగుణం పెరుగుతుందని పండితులు సూచిస్తారు
ఈ ప్రమాదం! :
- శంఖాన్ని ఉదడం సరైన పద్ధతిలో నేర్చుకోవాలి. లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది
- గాలిని బంధించి, ఎంతో శక్తిని వినియోగించి శంఖాన్ని పూరించాల్సి ఉంటుంది.
- ఇది సరైన క్రమంలో చేయకపోతే చెవులు, కళ్ల కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందట. ఇంకా డయాఫ్రాగం (లంగ్స్ - పొట్ట మధ్యలో ఉండే కండరం) దెబ్బతినే అవకాశం ఉంటుందట.
- అనుభవం లేనివారు తెలిసిన వాళ్ల నుంచి నేర్చుకోవాలి
- అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువ సేపు శంఖం ఊదకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చాలా సేపు ఊదితే శరీరంలో ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు.