జ్యోతిర్లింగం + శక్తి పీఠం – ఈ రెండు మహిమాన్విత స్థానాలు కలిసిన ఏకైక క్షేత్రం ఇదే!


 Srisailam Bhramaramba Shakti Peeth : దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రులలో అష్టాదశ శక్తిపీఠాలు గురించి చదివినా, విన్నా నవరాత్రులలో దేవి ఉపాసన చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు అందుబాటులో ఉన్న శక్తి పీఠం శ్రీశైల భ్రమరాంబిక క్షేత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

శ్రీశైల భ్రమరాంబిక క్షేత్ర స్థల పురాణం
స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం ప్రకారం, పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు లోక కంటకుడై అందరిని బాధిస్తుండేవాడు. ఒకసారి అరుణాసురుడు గాయత్రీ దేవిని ఉపాసన చేసి అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. కానీ అందుకు గాయత్రీదేవి బ్రహ్మ దేవుడు మాత్రమే అమరత్వాన్ని ప్రసాదించగలడని చెబుతుంది. అప్పుడు అరుణాసురుడు బ్రహ్మ దేవుని కోసం ఘోర తపస్సు చేస్తాడు. దేవతలంతా బ్రహ్మ దేవునితో లోక కంటకుడైన అరుణాసురునికి అమరత్వం ప్రసాదిస్తే ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోతాయి కాబట్టి అతనికి వరం ఇవ్వద్దని ప్రార్థిస్తారు.

అరుణాసురునికి వరం ఇచ్చిన బ్రహ్మ
చివరకు అరుణాసురుని తపస్సుకు మెచ్చి బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు తనకు అమరత్వం ప్రసాదించమని కోరగా, బ్రహ్మ దేవుడు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదని వేరే ఏదయినా వరం కోరుకోమని అంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు తనకు రెండు కాళ్ళు, నాలుగు కాళ్ళతో సంచరించే ప్రాణుల ద్వారా మరణం రాకూడదని కోరుకుంటాడు. బ్రహ్మ అలాగే అని వరమిచ్చి అంతర్థానమవుతాడు.

వరగర్వంతో అరుణాసురుని ఆగడాలు
వరగర్వంతో రెచ్చిపోయిన అరుణాసురుడు దేవతలను, మానవులను ముప్ప తిప్పలు పెట్టసాగాడు. ఇంద్రాది దేవతలను జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. అప్పుడు దేవతలంతా పార్వతి దేవిని ప్రార్థించారు. లోకకల్యాణం కోసం పార్వతి దేవి ఆరు కాళ్ళ భ్రమర రూపాన్ని ధరించి, అనేక తేనెతీయాలను సృష్టించి వాటి సహాయంతో అరుణాసురుని సంహరించింది. ఆనాటి నుంచి పార్వతి దేవి భ్రమరాంబిక దేవిగా శ్రీశైలంలో వెలసి పూజలందుకుంటోంది. ఇప్పటికి మనం శ్రీశైలంలో అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న గోడకు చెవి ఆనించి ఏకాగ్రతతో వింటే ఝుమ్మని భ్రమర కీటక నాదాన్ని వినవచ్చు.

శక్తి పీఠంగా
శ్రీశైలఖండంలోని 23వ అధ్యాయంలో శ్రీ భ్రమరాంబిక దేవి ప్రాముఖ్యత, చరిత్రను గురించిన వివరణ ఉంది. దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం తరువాత ఆమె శరీరంలోని భాగాలు 18 ప్రదేశాల్లో పడ్డాయని అవన్నీ శక్తి పీఠాలుగా వెలిశాయని ఈ గ్రంథం ద్వారా మనకు తెలుస్తోంది. అందులో ముఖ్యమైన మెడ అంటే గొంతు భాగం పడిన ప్రదేశమే శ్రీశైల భ్రమరాంబిక క్షేత్రంగా శక్తి పీఠంగా విరాజిల్లుతోంది.

భ్రమరాంబిక ఆలయ విశేషాలు
శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామి ఆలయానికి వెనుక ఎత్తైన ప్రదేశంలో భ్రమరాంబిక ఆలయం ఉంది. ఇక్కడ దేవిని పరాశక్తి రూపంలో పూజిస్తారు. గర్భగుడిలో ఉన్న భ్రమరాంబ ఉగ్రరూపిణి భయంకరంగా కనిపిస్తుంది. ఎనిమిది చేతులతో ఆయుధాలతో కనపడుతుంది. మహిషాసురమర్దిని రూపంలో భ్రమరాంబ దర్శనమిస్తుంది. అయితే ఉత్సవాలలో ఊరేగించే దేవి సౌమ్య స్వరూపిణిగా ఉండడం విశేషం. గర్భగుడిలోని విగ్రహానికి సందర్శకులు పూజచేయడాన్ని అనుమతించరు. గర్భగుడి ప్రవేశద్వారం దగ్గరే భక్తులు శ్రీచక్రానికి, కమల పీఠానికి కుంకుమపూజ చేస్తారు. ఇక్కడ ఉన్న కమలపీఠం మీద కూర్చొని భ్రమరాంబికా దేవి తపస్సు చేసిందట.

ఆలయ చరిత్ర
దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో భౌరాపూర్‌ చెరువు దగ్గర వెలసిన భ్రమరాంబ అమ్మవారికి చాళుక్యులు, రెడ్డిరాజులు, విష్ణుకుండినుల పాలనలో దేవాలయాన్ని నిర్మించారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆదివాసీల సోదరి అయిన భ్రమరాంబికను పరమేశ్వరుడు వివాహం చేసుకోవడం వలన చెంచు గిరిజనులు ఈశ్వరుడిని బావగా పిలుచుకొంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. మహాశివరాత్రి రోజున, పూర్వకాలం నుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కల్యాణం చేసే పద్ధతి నేటికీ కొనసాగుతోంది.

పురాణం పురుషులు సందర్శించిన గుడి
శ్రీశైల మల్లిఖార్జున, భ్రమరాంబిక ఆలయాన్ని పాండవులు, శ్రీ రాముడు లాంటి పురాణ పురుషులు సందర్శించి పూజలు చేసారని ఆలయ చరిత్ర చెబుతుంది. శ్రీశైల ఆలయాన్ని రక్షించడానికి, కొంత మంది రాజులు ఆలయం చుట్టూ కోట లాంటి నిర్మాణాన్ని నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారాలు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలతో, అత్యద్భుతమైన రీతిలో ఈ దేవాలయ సముదాయాన్ని నిర్మించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలంను నవరాత్రులలో దర్శించడం అత్యంత పుణ్యప్రదం. సౌభాగ్యదాయకం.

పూజోత్సవాలు
భ్రమరాంబిక ఆలయంలో ప్రతి నిత్యం శాస్త్రోక్తంగా పూజలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తారు. అలాగే శ్రావణ మాసంలో పసుపు కొమ్ములు, గాజులు, చీరలతో అలంకరిస్తారు. ఇక దేవి నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల పేరిట ఒక్కోరోజు ఒక్కో స్వరూపంతో పూజిస్తారు.

ఎలా చేరుకోవాలి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు అతి సమీపంలో ఉన్న శ్రీశైలానికి చేరుకోడానికి అత్యంత ఆధునిక రవాణా సదుపాయాలు ఉన్నాయి. ఈ నవరాత్రులలో మనం కూడా శ్రీశైల భ్రమరాంబిక క్షేత్రాన్ని దర్శిద్దాం. తరిద్దాం.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow