గౌతమీ గోదావరి తీరంలో వెలసిన కోటిపల్లి క్షేత్రం - ఈ పుణ్యక్షేత్రం విశేషాలివే!
కోటిపల్లి పుణ్యక్షేత్రం ఎక్కడుంది?
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంకు కేవలం 15 కి.మీ. దూరంలో పావన గౌతమి తీరంలో వెలసిన పుణ్య క్షేత్రం కోటిపల్లి. ఈ క్షేత్రంలో కశ్యప మహర్షిచే ప్రతిష్ఠించబడిన శ్రీ సిద్ధి జనార్ధన స్వామి, ఇంద్రునిచే ప్రతిష్ఠించబడిన శ్రీ కోటేశ్వర స్వామి, చంద్రునిచే ప్రతిష్ఠించబడిన శ్రీ సోమేశ్వర స్వామి కొలువై ఉన్నారు. కోటిపల్లి క్షేత్ర మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం, గౌతమీ మహత్యం వంటి పురాణ గ్రంథాలలో ప్రస్తావించినట్లు స్థలపురాణం చెబుతోంది.
స్థల పురాణం
ఆలయ స్థల పురాణానికి సంబంధించిన పురాణగాథ ప్రకారం, బలి చక్రవర్తి నుంచి దేవతలను రక్షించేందుకు దేవతలందరూ కశ్యప మహర్షిని వెంటబెట్టుకుని శ్రీమన్నారాయణుడిని ప్రార్థించారు. అప్పుడు కశ్యప మహర్షి భార్య అదితి గర్భంలో వామనమూర్తిగా శ్రీమహావిష్ణువు అవతరించి, బలి చక్రవర్తి నుంచి మూడడుగుల భూమిని దానంగా స్వీకరించి దేవతలకు రాజ్యాన్ని తిరిగి అందించిన అనంతరం ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసినట్లు స్థలపురాణం చెబుతోంది.
శ్రీ సిద్ధి జనార్ధన స్వామి
పరమ పావనమైన కోటిపల్లి క్షేత్రంలో కశ్యప మహర్షి శ్రీ సిద్ధి జనార్ధన స్వామిని ప్రతిష్ఠించినట్లు పురాణగాథ. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా కొలువై ఉన్నారు.
శ్రీ కోటేశ్వర లింగం
అదే విధంగా ఇంద్రుడు, అహల్యను గురించి జరిగిన పురాణగాథతో కోటేశ్వర లింగానికి సంబంధం ఉందని స్థలపురాణం చెబుతోంది. గౌతమ మహర్షి శాపానికి గురైన ఇంద్రుడు, అహల్య తమను క్షమించమని ప్రార్థించగా, శ్రీరాముని పాదస్పర్శతో అహల్య శాప విముక్తి పొందుతుందని, ఇంద్రుడు కోటేశ్వర లింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి పూజించడం ద్వారా శాపవిముక్తి పొందుతాడని గౌతమ మహర్షి చెప్పినట్లు పురాణగాథ. అలా ఇంద్రునిచే ప్రతిష్ఠించబడిన లింగమే శ్రీ కోటేశ్వర స్వామి.
శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి
పూర్వం చంద్రుడు తన గురుపత్ని తారను మోహించిన కారణంగా పాపానికి గురై, తన సహజమైన వెన్నెల కాంతిని కోల్పోయి క్షయ వ్యాధితో బాధపడినట్లు పురాణగాథ. అనంతరం చంద్రుడు తీవ్ర తపస్సు చేసి శ్రీమహావిష్ణువును ప్రార్థించగా, కోటితీర్థం క్షేత్రంలో గౌతమీ నదిలో స్నానం చేసి, జనార్ధన స్వామిని దర్శించి, పార్వతి సమేత సోమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి, కోటి బిల్వదళాలతో స్వామివారిని ఆరాధించమని విష్ణుమూర్తి ఆదేశించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. అనంతరం శ్రీ మహా విష్ణువు ఆదేశం మేరకు చంద్రుడు పార్వతీ సమేత సోమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి, కోటి బిల్వదళాలతో ఆరాధించడంతో తన కోల్పోయిన కాంతిని తిరిగి పొందాడని, అందుకే ఈ క్షేత్రానికి ఛాయా సోమేశ్వర క్షేత్రం అనే పేరు వచ్చింది.
పూజోత్సవాలు - ప్రత్యేక ఉత్సవాలు
కోటిపల్లి క్షేత్రంలో వెలసిన మూడు ఆలయాల్లో ప్రతిరోజూ శైవ ఆగమ రీతిలో నిత్య పూజలు అభిషేకాలు జరుగుతాయి. ప్రతి ఏడాది మాఘ మాసంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు స్వామి వారి కల్యాణ మహోత్సవం, శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు. కార్తిక మాసం నెల రోజులు దీపోత్సవాలతో, శివాభిషేకాలతో ఆలయం సందడిగా ఉంటుంది. ఈ మాసంలో వచ్చే క్షీరాబ్ధి ద్వాదశి రోజు తెప్పోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది.
ఎలా చేరుకోవాలి?
కాకినాడ నుంచి సుమారు 38 కి.మీ. దూరంలో, రాజమహేంద్రవరం నుంచి సుమారు 60 కి.మీ. దూరంలో, అమలాపురం నుంచి సుమారు 15 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి అన్ని జిల్లా కేంద్రాల నుంచి మెరుగైన రవాణా సదుపాయాలున్నాయి.
పవిత్ర గౌతమీ గోదావరి తీరంలో పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న ఈ పురాతన పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వలన జన్మాంతర పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం. మనం కూడా కోటిపల్లి క్షేత్రాన్ని దర్శించి మోక్షాన్ని పొందుదాం.