తిరుమల శ్రీవారి ఆలయానికి హనుమంతుడికి బేడీలు వేసిన అంజనాదేవి - తల్లి మాటకు కట్టుబడి నేటికీ తిరుమలలో స్వామివారి కోసం హనుమ ఎదురుచూస్తున్నారని నమ్మకం
బేడీ ఆంజనేయస్వామి దేవాలయం ఎక్కడుంది?
బేడీ ఆంజనేయస్వామి దేవాలయం తిరుమలలో శ్రీవారి సన్నిధికి తూర్పు మాడ వీధిలో మహద్వారానికి, అఖిలాండానికి ఎదురుగా ఉంటుంది. ఈ ఆలయంలో హనుమ వెంకటేశ్వర స్వామికి ఎదురుగా రెండు చేతులు అంజలి ఘటించి వేంకటేశ్వరస్వామి వారికి నమస్కరిస్తున్న భంగిమలో దర్శనమిస్తాడు. ఇక్కడే శ్రీరాముడు హనుమంతుని కలిసాడని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. తిరుమల యాత్రకు దర్శనానికి వెళ్లిన వారు బేడీ ఆంజనేయ స్వామిని దర్శించకుండా యాత్ర సంపూర్ణం కాదు. ఈ విశిష్టమైన ఆలయ విశేషాలు, స్థల పురాణం గురించి తెలుసుకుందాం.
ఆలయ చరిత్ర
క్రీస్తు శకం 1841 ప్రాంతంలో దేవస్థానం అధికారులైన మహంతు వల్ల పూరీ జగన్నాథం నుంచి వచ్చిన సంప్రదాయమే ఈ బేడీ ఆంజనేయస్వామి అని తెలుస్తోంది. పూరీ నగరంలో కూడా ఇలాంటి బేడీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆ క్షేత్రంలో ఈ ఆలయాన్ని దరియా మహావీర దేవాలయం అని పిలుస్తారు. అదే తరహాలో తిరుమలలో కూడా బేడీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా వెలసి ఉంది. తిరుమలలోని ఆంజనేయస్వామి ఆలయం ముఖ మండపం, గర్భాలయం అని రెండు భాగాలుగా నిర్మించారు. బేడీ ఆంజనేయ స్వామి గర్భాలయంలో సుమారు 6 అడుగుల ఎత్తున్న ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. గర్భాలయంపై ఏక కలశ గోపురం కనిపిస్తుంది. గోపురానికి నాలుగు మూలల్లో సింహాలు చెక్కి ఉండడాన్ని చూడవచ్చు. ఆలయంలో భక్తులు ప్రదక్షిణాలు చేయడానికి ప్రదక్షిణ మండపం కూడా ఉంది.
స్థల పురాణం - ఎందుకు వేశారు బేడీలు?
బేడీ ఆంజనేయ స్వామి క్షేత్రం వెనక ఉన్న పౌరాణిక కథనం ప్రకారం హనుమంతుడు తన చిన్నతనంలో తన వాహనమైన ఒంటెను వెతకడానికి తిరుమల వదిలి పారిపోతుంటే ఆంజనేయుని తల్లి అంజనాదేవి హనుమ చేతులకు బేడీలు తగిలించిందట. హనుమంతుడు, తన ప్రియమైన తల్లి పట్ల ఉన్న అపారమైన గౌరవంతో, ఆమె తిరిగి వచ్చేవరకు తాను తప్పకుండా అక్కడే ఉంటానని చాలా విధేయతతో తల వూపి వాగ్దానం చేశాడు. ఆ తరువాత, హనుమంతుడిని అక్కడ ఒంటరిగా వదిలి, అంజనా దేవి తిరుమల కొండలను విడిచి హిమాలయాలకు వెళ్ళిపోయింది.
బేడీ ఆంజనేయ స్వామి పేరు ఇలా వచ్చింది!
ఆ తర్వాత, కొన్ని కారణాల వల్ల, అంజనా దేవి తిరుమల కొండలకు తిరిగి రాలేదు. ఆమె హిమాలయాల్లోని ఆకాశ గంగ సమీపంలో స్థిరపడింది. హనుమ తన తల్లి ఆజ్ఞను శిరసావహిస్తూ నేటికీ తిరుమల కొండలపై, తిరుమల ఆలయంలోని పవిత్ర మహాద్వారం ఎదురుగా ముకుళిత హస్తాలతో హిమాలయాల నుంచి వచ్చే తన తల్లి రాక కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్నాడని స్థల పురాణం చెబుతుంది. అందుకనే ఈయనను బేడీ ఆంజనేయస్వామి అంటారు. ఇప్పటికి గర్భాలయంలో దర్శనమిచ్చే హనుమ విగ్రహం చేతులకు బేడీలు తగిలించి ఉండటాన్ని గమనించవచ్చు.
భక్తుల కష్టాలు తీర్చే పవన సుతుడు
బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ వెలసి ఉన్న హనుమ భరించలేని కష్టాలతో తనను దర్శించడానికి వచ్చిన భక్తుల కష్టాలు తీర్చి వారికి ఉపశమనం కలిగిస్తాడని విశ్వాసం.
ఆలయ విశేషాలు
తన ప్రియ భక్తుడు తన ఆలయం ముందు ఒంటరిగా నిలబడి ఉండటాన్ని చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి, హనుమాన్ తల్లి తిరిగి వచ్చే వరకు రోజూ అతనికి సకాలంలో అన్నపానాదులు అందించి, జాగ్రత్తగా చూసుకోమని తన ఆలయ అర్చకులను ఆదేశించారట! ఈ కారణంగానే ప్రతిరోజు మూడుపూటలా ఆనందనిలయంలో వేంకటేశ్వర స్వామికి నివేదన జరిగాక, బేడీ ఆంజనేయ స్వామికి నైవేద్యం సమర్పించడం సంప్రదాయం. ఈ నివేదన శ్రీవారి ఆలయం నుంచే వస్తుంది. ప్రతి ఆదివారం ఆంజనేయ స్వామికి పంచామృతాభిషేకం జరుగుతుంది. ప్రతి మాసంలో వచ్చే పునర్వసు నక్షత్రం రోజున సీతారామలక్ష్మణులు ఊరేగుతూ ఇక్కడకు వస్తారు. సీతారామలక్ష్మణులకు ఇచ్చిన శేష హారతిని ఆంజనేయస్వామికి ఇస్తారు. శ్రీరాముని మెడలోని పుష్ప హారాన్ని బేడీ ఆంజనేయ స్వామికి సమర్పిస్తారు. ఇక చైత్ర, వైశాఖ మాసంలో హనుమజ్జయంతి రోజు విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రతి మంగళవారం, శనివారం స్వామివారికి ఆకు పూజలు, సింధూర పూజలు విశేషంగా జరుగుతాయి.
మొక్కులు తీర్చుకునే పుణ్య ప్రదేశం
తిరుమల శ్రీవారికి కొబ్బరికాయ మొక్కులు మొక్కుకున్న భక్తులు బేడీ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉన్న అఖిలం వద్దనే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు మనం కూడా బేడి ఆంజనేయ స్వామిని దర్శించి తరిద్దాం.