🕉 శ్రీ మణికంఠుని చరితం – భాగం 1 🕉
లింగ వాయు పురాణాలలో భూతనాథోపాఖ్యానము
మణికంఠుడు, ధర్మశాస్త్రుని దివ్య చరిత్రను సావధాన చిత్తులై వినండి.
🌺 మణికంఠుని చరితం 🌺
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః॥
ఏకదంతం మహాకాయం
కోటి సూర్య సమప్రభం
నిర్విఘ్నం కురుమే దేవ
సర్వకార్యేషు సర్వదా॥
గురువును, విఘ్నేశ్వరుని ధ్యానించి సూతమహర్షి ఇలా చెప్పసాగారు.
శౌనకాది మునులారా! ప్రళయకాలం అనంతరం బ్రహ్మదేవుడు పధ్నాలుగు లోకాలను, వాటిలో నివసించే జీవరాశులను సృష్టించాడు. మహావిష్ణువు స్థితికార్యాన్ని, పరమేశ్వరుడు లయకార్యాన్ని నిర్వహిస్తూ వైకుంఠం, కైలాసాలలో నివసిస్తున్నారు. కృతయుగంలో మానవులు సత్వ, రజ, తమోగుణాలతో స్వాయంభువ మనువు ద్వారా విస్తరించారు. భూమి కర్మభూమిగా ప్రసిద్ధి చెందింది.
మానవులు తమ కర్మలను అనుసరించి స్వర్గాది లోకాలలో సుఖాలను, నరకాలలో శిక్షలను అనుభవించి తిరిగి భూమిపై జన్మిస్తారు. దేవతలకు, దైత్య దానవులకు మధ్య యుద్ధాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. ధర్మ పరిరక్షణ కోసం అవసరమైనప్పుడు శ్రీమహావిష్ణువు అవతరిస్తాడు. ఈ విషయాలన్నీ బ్రహ్మ సభలో ఒకసారి చర్చకు వచ్చాయి.
🌸 బ్రహ్మ సభ 🌸
అప్పుడే "నారాయణ! నారాయణ!" అంటూ నారద మహర్షి సభలో ప్రవేశించాడు.
నారదుడు: "ఆహా! త్రిమూర్తులు, వారి సతీమణులు, ఇంద్రాది దేవతలు, సప్తఋషులతో ఈ సభ ఎంతో శోభాయమానంగా ఉంది. ఏ విషయంపై చర్చిస్తున్నారు దేవగురూ?"
బృహస్పతి చిరునవ్వుతో, "భూలోక పరిస్థితులను సమీక్షిస్తున్నాం నారదా" అని సమాధానమిచ్చాడు.
ఇంద్రుడు నమస్కరించి ఇలా అన్నాడు— "త్రిమూర్తులకు, త్రిదేవీమాతలకు నా ప్రణామాలు. మీ కృపవల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వంటి రాక్షసుల సంహారం జరిగి, ప్రహ్లాదుడు ధర్మపాలన చేస్తుండడంతో భూలోకంలో మళ్లీ యజ్ఞయాగాలు సక్రమంగా జరుగుతున్నాయి. మీకు మా శతకోటి ప్రణామాలు."