సృష్టి, స్థితి, లయ అనే మూడు కార్యాలను మూడు రూపాలలో నిర్వహించేది నిర్గుణ పరబ్రహ్మమే. ఈ భూలోకంలో జీవాత్మగా ప్రతి హృదయంలో పరమాత్మ వెలుగొందుతాడు. జీవుడు జననం నుండి వృద్ధాప్యం వరకు కర్మలను అనుభవించి, వాటి ఫలితానుసారం మరొక శరీరాన్ని పొందుతాడు.
గురుపుత్రా! అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు జీవాత్మను కప్పివేస్తాయి. అందువల్ల పరమాత్మను దర్శించే అదృష్టాన్ని కోల్పోతాడు. బ్రహ్మజ్ఞానం పొందలేక అజ్ఞానంలోనే జీవితం గడుస్తుంది.
"ధన్యులం ఓంకారరూపా! మణికంఠా! మీకు మా కోటి కోటి ప్రణామాలు." అంటూ గురువుగారు, ఆయన కుమారుడు నమస్కరించారు. గురువు అనుమతితో మణికంఠుడు రాజధానికి తిరిగి వచ్చాడు.
అప్పటికే పదేళ్ల వయస్సులో ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ ప్రజాహిత పాలనతో అందరి అభిమానాన్ని పొందాడు. తన కుమారుడి పాలనా సామర్థ్యాన్ని చూసి రాజశేఖరుడు పట్టాభిషేకం చేయాలనే సంకల్పం చేసుకున్నాడు.