నవగ్రహ దోషాలతో ఇబ్బంది పడుతున్నారా? - 'పురటాసి మాసం'లో ఈ టెంపుల్స్​కు వెళ్లండి!

పురటాసి మాసం 2026

తమిళులు విశేషంగా భావించే ‘పురటాసి మాసం’!
శనివారాల్లో ఇలా చేస్తే విశిష్ట ఫలితాలు!

Purattasi Masam 2026: తమిళులు ‘పురటాసి మాసం’ చాలా విశేషమైనదని భావిస్తారు. ఈ మాసంలో కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారు. ముఖ్యంగా ఈ నెలలో వచ్చే శనివారాలు భక్తులకు శనిదోష నివారణకు, స్వామివారి అనుగ్రహానికి ఎంతో అనుకూలమైన రోజులుగా చెబుతుంటారు.

ఈ పవిత్ర మాసంలో తమిళనాడులోని ప్రధాన వైష్ణవ దివ్యదేశాలు, పెరుమాళ్‌ ఆలయాలన్నీ భక్తులు, ఉత్సవాలతో కళకళలాడుతుంటాయి. ఇంతకీ, అసలు ‘పురటాసి మాసం’ అంటే ఏమిటి? ఇది ఎందుకంత ప్రత్యేకం?

పురటాసి మాసం అంటే ఏమిటి?

పన్నెండు మాసాలను కలిపి ఒక సంవత్సరంగా చెబుతారు. మాసాల పేర్లు తెలుగులో, తమిళంలో వేరువేరుగా ఉంటాయి. చంద్రమానం ప్రకారం తెలుగు మాసాలు లెక్కగడితే, తమిళ మాసాలు మాత్రం సౌరమానం ప్రకారం లెక్కగడతారు. సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఆయా మాసానికి పేరు ఉంటుంది.

తమిళ సంప్రదాయం ప్రకారం ఆరో నెలను పెరటాసిగా పిలుస్తారు. దీనినే ‘పురటాసి, పెరుమాళ్’ అని కూడా అంటారు. తమిళనాడు సంస్కృతిలో భాద్రపద, ఆశ్వయుజ మాసాల మధ్య ఈ ‘పురటాసి మాసం’ వస్తుంది. ఈ నెల శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రియమైనది. సెప్టెంబర్ 18, 2026 శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ మాసం అక్టోబర్ 17 శనివారం వరకు కొనసాగనుంది.

పురటాసి ఎందుకంత ప్రత్యేకం?

శ్రీ వేంకటాచల మహాత్మ్యం ద్వారా శ్రీమహావిష్ణువు ‘శ్రీనివాసుని’గా ఈ మాసంలోని శ్రవణ నక్షత్రంలో అవతరించిన మాసమే పురటాసి మాసం (పెరటాసి మాసం) అని తెలుస్తోంది.

ద్రవిడ సంప్రదాయం ప్రకారం ‘తిరు’ అంటే ‘శ్రీ’ అని అర్థం వస్తుంది. తిరు నక్షత్రం అంటే ‘శుభ నక్షత్రం’ అంటారు. అలాగే, శ్రీనివాసుని తిరు నక్షత్రమైన శ్రవణ నక్షత్రం నాడే స్వామి ఏడుకొండలపై వెలిశాడని భక్తుల నమ్మకం. ఇదే విషయం శ్రీ వ్యాస మహర్షులు రచించిన శ్రీ స్కాంద పురాణంలో ఉన్న వైష్ణవ ఖండములోని ‘శ్రీ వేంకటాచల మాహాత్మ్యం’లో తెలియజేశారు.

పురటాసి మాసంలో వచ్చే శనివారాలను శనిదోష నివారణకు, స్వామివారి అనుగ్రహానికి ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు భక్తులు. ఈ రోజుల్లో శాకాహారాన్ని భుజిస్తూ ఇళ్లలో బియ్యంపిండి, బెల్లం, నెయ్యితో ‘మావిళక్కు’ అనే దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తికి నివేదిస్తుంటారు.

శ్రీరంగంలో విశేష తిరుమంజనం

తిరుచ్చి జిల్లా శ్రీరంగంలో ఉన్న ‘శ్రీ రంగనాథస్వామి టెంపుల్’ 108 దివ్యదేశాలలో మొదటిది. పురటాసి మాసంలో ఇక్కడ శేషపాన్పుపై పవళించిన రంగనాథునికి విశేష తిరుమంజనం, గరుడ వాహన సేవలు, ప్రత్యేక అలంకార సేవలు నిర్వహిస్తారు.

అలాగే కాంచీపురంలోని ప్రసిద్ధ శ్రీ వరదరాజ పెరుమాళ్‌ దేవాలయంలోనూ ఈ నెల మొత్తం స్వామివారికి శనిదోష నివారణ పూజలు, వేర్వేరు వాహనాలపై గ్రామోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి.

తిరువళ్లిక్కేణిలో చక్రత్తాళ్వార్‌ పూజలు

చెన్నై తిరువళ్లిక్కేణిలోని ‘శ్రీ పార్థసారథి ఆలయం’ పురటాసి పూజలకు ముఖ్య కేంద్రంగా నిలుస్తుంది. ఇక్కడ మహాభారతంలో అర్జునుడికి సారథిగా నిలిచిన కృష్ణుడు మీసాలతో దర్శనమిస్తాడు.

ముఖ్యంగా ఈ టెంపుల్‌లో శనివారాలలో చక్రత్తాళ్వార్‌ పూజలు, సహస్రనామార్చనలు విశేషంగా నిర్వహిస్తారు. అదేవిధంగా, పురటాసి మాసంలోని ప్రతీ శనివారం చెన్నై టీనగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోని స్వామివారు విశేష అలంకరణలో భక్తులను కటాక్షిస్తారు.

మదురై సమీపంలోని కొండల మధ్య వెలసిన అళగర్‌ కోవిల్‌ శ్రీ కళ్లలగర్‌ టెంపుల్‌లో ఈ నెలలో పవిత్ర తీర్థస్నానాలు, సుందరరాజ పెరుమాళ్‌కు ప్రత్యేక నైవేద్య సమర్పణలు ఉంటాయి.

శ్రీవిల్లిపుత్తూర్‌లో ఊంజల్‌ సేవలు

గోదాదేవి అవతరించిన శ్రీవిల్లిపుత్తూర్‌ శ్రీ ఆండాల్‌ సమేత రంగమన్నార్‌ పుణ్యక్షేత్రంలో ఆండాల్‌ అమ్మవారికి, రంగమన్నార్‌ స్వామికి ఊంజల్‌ సేవలు, వర్ణరంజిత పుష్పాలంకరణలు నిర్వహిస్తారు.

కుంభకోణంలోని అతిపెద్ద వైష్ణవ క్షేత్రమైన శ్రీ సారంగపాణి టెంపుల్‌లో ఈ పురటాసి మాసంలో రథోత్సవాలు, తీర్థవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

అలాగే, కుంభకోణం దగ్గరలోని శ్రీ ఒప్పిలియప్పన్‌ దేవాలయం తిరుమలకు ప్రత్యామ్నాయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి నైవేద్యంలో ఉప్పు వాడకపోవడం ఇక్కడి ప్రత్యేకత. తిరుమల వెళ్లడం వీలు కానీ భక్తులు పురటాసి శనివారాల్లో ఒప్పిలియప్పన్‌ స్వామిని దర్శించుకుని తిరుమల యాత్ర ఫలాన్ని పొందుతారు.

ఈ ఆలయాలను దర్శిస్తే నవగ్రహ దోషాల నివారణ!

పురటాసి మాసంలో నవగ్రహ దోష పరిహారాలకు ‘నవ తిరుపతి’ అంటే తూత్తుకుడి, తిరునెల్వేలి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ‘నవ తిరుపతి ఆలయాల’ సముదాయాన్ని ఒకేరోజు దర్శించుకోవడం నవగ్రహ దోషాలను తొలగిస్తుందని భక్తుల విశ్వాసం.

ఇక చెన్నై దగ్గరలోని తిరువళ్లూర్‌ జిల్లా శ్రీ వీరరాఘవస్వామి టెంపుల్‌లో భక్తులు అనారోగ్యాల నుంచి ఉపశమనం కోసం పురటాసి నెలలో పవిత్ర తీర్థంలో స్నానమాచరించి స్వామివారికి బెల్లం, రసం నివేదించి మొక్కులు చెల్లించుకుంటారు.

ఓం నమో వేంకటేశాయ 🙏
పురటాసి మాసంలో శ్రీ వేంకటేశ్వరస్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని భక్తుల విశ్వాసం.

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow