'దసరా, బతుకమ్మ' పండుగల తేదీలు ఇవే - ఆ రోజు నుంచే దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం!

అక్టోబరులో ముఖ్యమైన పండుగల వివరాలిలా - విజయదశమి ఎప్పుడొచ్చిందంటే?

అక్టోబరు 2026 ముఖ్య పండుగలు

October 2026 Festival List: శరదృతువులో వచ్చే ఆశ్వయుజ మాసం హిందూ సంప్రదాయంలో చాలా విశేషమైన మాసం. దేవీ ఆరాధనకు ఈ మాసం అత్యంత విశిష్టమైనది. ఈ నెలలో జరిగే శరన్నవరాత్రులు, దుర్గాష్టమి, మహానవమి, దసరా శక్తి, విద్య, ధైర్యం, విజయసిద్ధులకు సంకేతాలుగా భావిస్తారని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు, పంచాంగ కర్త డా. శంకరమంచి శివ సిద్ధాంతి.

శరద్ పౌర్ణమి రోజు శ్రీమహాలక్ష్మీ ఆరాధన, చంద్రారాధనకు చాలా ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ఈ మాసాన్ని దేవీ ఉపాసనకు, విజయసంకల్పానికి, ఐశ్వర్యప్రాప్తికి విశిష్టమైనదిగా భావిస్తారు.

మాసశివరాత్రి మొదలు మహాలయ అమావాస్య, బతుకమ్మ పండుగ, దసరా, శరద్ పౌర్ణమి ఈ అక్టోబరులోనే ఉన్నాయి. మరి, ఏ పండుగ ఏ తేదీన వస్తుందో ఇప్పుడు చూద్దాం.

అక్టోబరు 2026లో వచ్చే ముఖ్య తిథులు, పండుగల వివరాలు

అక్టోబరు 6న ఇందిరా ఏకాదశి

ఈ రోజు పితృదేవతల శ్రేయస్సు, విష్ణు అనుగ్రహం కోసం ఉపవాసం ఉండడం, శ్రీహరి ఆరాధన చేయడం విశేష ఫలప్రదమని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు, పంచాంగ కర్త డా. శంకరమంచి శివ సిద్ధాంతి.

అక్టోబరు 9న మాస శివరాత్రి

పరమేశ్వరుడి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. శివారాధన, అభిషేకం, 'ఓం నమః శివాయ' జపానికి ఇది మంచి రోజుగా భావిస్తారు.

అక్టోబరు 10న మహాలయ అమావాస్య

మహాలయ అమావాస్య అక్టోబరు 10న వస్తోంది. ఈ రోజు పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధకర్మలు చేయడానికి అత్యంత ప్రధానమైనదని చెబుతున్నారు పండితులు.

అక్టోబరు 11న దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం

దేవీ శరన్నవరాత్రులు ఈ నెల 11న ప్రారంభంకానున్నాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాలలో ఆరాధిస్తారు. ఇళ్లు, దేవాలయాలలో కలశస్థాపన చేసి దేవీపూజ ప్రారంభిస్తారు.

అక్టోబరు 16న మూలా సరస్వతీ పూజ

ఈ రోజు సరస్వతీ పూజకు చాలా మంచి రోజు. ఈ సందర్భంగా విద్య, వాక్పటుత్వం, జ్ఞానసిద్ధి కోసం శ్రీ సరస్వతీదేవిని విశేషంగా పూజిస్తారు.

అక్టోబరు 18న దుర్గాష్టమి; బతుకమ్మ పండుగ

అక్టోబరు 18న దుర్గాష్టమి వచ్చింది. ఈ రోజు జగన్మాతను మహాదుర్గ స్వరూపంలో పూజిస్తారు. అలాగే, తెలంగాణలో విశేషంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ ఇదే రోజు. అలాగే, తుల సంక్రమణం కూడా ఈ రోజే. అంటే రవి తులారాశిలో ప్రవేశిస్తాడు.

అక్టోబరు 19న మహానవమి; సువాసినీ పూజ

దేవీ నవరాత్రులలో అత్యంత ప్రధానమైనదిగా భావించే మహానవమి ఈ నెల 19న వస్తోంది. ఈ రోజు అమ్మవారి ఆరాధనతో పాటు సువాసినీ పూజ, కన్యాపూజ వంటి సంప్రదాయ పూజలు జరుపుతారు.

అక్టోబరు 20న దసరా; శమీపూజ

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకొంటాం. హిందువులు జరుపుకొనే అతిపెద్ద పండగలలో ఒకటైన విజయదశమి ఈ నెల 20న వచ్చింది. ఇది విద్యారంభం, ఆయుధపూజ, శమీపూజ, కొత్త కార్యాల ప్రారంభానికి మంచి సమయంగా భావిస్తారు. అలాగే, ఇదే రోజు శతచండీ హోమ పూర్ణాహుతి జరుపుతారు.

అక్టోబరు 22న పాశాంకుశ ఏకాదశి

ఈ ఏకాదశి శ్రీమహావిష్ణువు ఆరాధనకు ప్రసిద్ధమైనది. ఉపవాసం మొదలు విష్ణునామస్మరణ, దానధర్మాలకు మంచి రోజు. ఇదే రోజు శ్రీ శారదాంబ దేవి రథోత్సవం, శ్రీ సురేశ్వరాచార్య జయంతి కూడా జరుగుతాయి.

అక్టోబరు 24న శని త్రయోదశి

ఈ నెల 24న శని త్రయోదశి వచ్చింది. శనివారంతో త్రయోదశి రావడం వల్ల శనీశ్వరుడు, శివారాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు.

అక్టోబరు 25న కోజాగరి వ్రతం

శరదృతువులో వచ్చే ఈ వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంది. శ్రీమహాలక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. సౌభాగ్యం, ఐశ్వర్యం కోసం లక్ష్మీపూజ చేయడం సంప్రదాయం.

అక్టోబరు 26న శరద్ పౌర్ణమి

చంద్రకాంతి విశేషంగా భావించే పవిత్ర పౌర్ణమి కూడా ఈ నెలలో విశేషమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవి, చంద్రుని పూజకు ప్రాధాన్యం ఉంటుంది. శృంగేరిలో శ్రీ శారదాంబ దేవికి అభిషేకం, తెప్పోత్సవం నిర్వహిస్తారని చెబుతున్నారు.

అక్టోబరు 29న సంకష్టహర చతుర్థి

ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత నాలుగో రోజు సంకష్టహర చతుర్థి వస్తుంది. ఈ రోజు విఘ్నేశ్వరుడిని ఆరాధించడానికి శ్రేష్ఠమైన రోజు. ఈ క్రమంలో చాలా మంది విఘ్నాలు, సంకటాలు తొలగాలని శ్రీగణపతిని ఉపవాసంతో ఆరాధిస్తుంటారు.

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow