ఇష్టదేవత, కులదేవత, గ్రామ దేవత, క్షేత్రపాలకులు... వారి మధ్య తేడాలు ఏమిటో తెలుసుకుందాం!
కులదేవత (లేదా కులదేవి)
ఒక వంశం లేదా కులానికి అధిష్టాన దైవం. హిందూ సంస్కృతిలో, ప్రతి కుటుంబంలోనూ కులదేవతకు అత్యంత గౌరవనీయమైన స్థానం ఉంటుంది. 'కులదేవత' అనే పదం 'కులం' (వంశం), 'దేవత' (దైవం) అనే పదాల కలయికతో ఏర్పడింది. ఈ దైవిక రక్షకుడు వంశ పారంపర్యానికి రక్షకుడిగా ఉంటాడు. కులదేవతను ఆరాధించడం అంటే పూర్వీకులను గౌరవించడం, కుటుంబంపై ఉన్న దైవిక రక్షణను గౌరవించడం అని అర్థం. ప్రతి గోత్రం లేదా వంశానికి ఒక ప్రత్యేక దైవం ఉంటారు. వీరు హనుమంతుడు, భైరవుడు లేదా దుర్గాదేవి రూపాలు కావచ్చు.
వివాహాలు, నామకరణం, గృహప్రవేశం వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు ముందు కులదేవతలను పూజించాలి. కార్యక్రమాన్ని దైవిక ఆశీస్సులతో ప్రారంభించాలి. పండుగల్లాంటి ప్రత్యేక రోజుల్లో దీపం వెలిగించాలి.
📖 వినాయక విగ్రహం పెట్టాలనుకుంటున్నారా? - 'ఇలాంటిదైతే' ధనలాభం ఉంటుందంటున్న జ్యోతిషులు!ఇష్టదేవత - వ్యక్తిగత అనుబంధం
ఇష్టదేవత అంటే వ్యక్తిగత దైవం అని అర్థం. దైవంతో ఆత్మకు ఉండే ప్రత్యేక అనుబంధం. కృష్ణుడు, దుర్గ, గణేశుడు లేదా శివుడు వంటి దైవ రూపాలతో ఆకర్షణ లేదా అనుబంధం పెంచుకోవడమే ఇష్టదేవతగా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి ఎవరితోనైతే గాఢమైన ఆధ్యాత్మిక సంభాషణను ఏర్పరచుకుంటారో ఆ దైవం. వ్యక్తి చైతన్యం విస్తరించే కొద్దీ ఇష్టదేవత మారవచ్చు, కాబట్టి ఈ అనుబంధం చాలా వ్యక్తిగతమైనది, ఆత్మ ఉద్ధరణకు దోహదపడేది.
ఇష్ట దేవతలందరికీ నిర్దిష్టమైన మంత్రాలు ఉంటాయి. వాటిని జపించడం ద్వారా బంధం మరింత బలపడుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లే వారితో మాట్లాడండి, మీ ఆశలను, కలలను పంచుకోవడం ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చు.
గ్రామ దేవత - గ్రామ సంరక్షకుడు
గ్రామ దేవత ఒక గ్రామానికి లేదా నివాస ప్రాంతానికి మతపరమైన సంరక్షకుడు. కులదేవతలా కాకుండా, గ్రామ దేవత ఏ ఒక్క కుటుంబానికీ ప్రత్యేకం కాదు. ఒక నిర్దిష్ట గ్రామం లేదా ప్రాంతానికి చెందిన వారి సంప్రదాయం ఈ భావనలో అంతర్గతంగా ఉంటుంది.
ప్రతి గ్రామంలో ముత్యాలమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, గంగమ్మ, మైసమ్మ ఉంటారు. లింగమంతుల స్వామి, భైరవుడు, కాటమయ్య ఇలా పూజలందుకుంటుంటారు. గ్రామాల్లో ప్రబలే అంటువ్యాధులను దూరంగా ఉంచుతారని, వర్షాలు కురిపిస్తారని, తాము నివసించే ప్రాంతం, గ్రామాలకు రక్షణ కల్పిస్తారని నమ్ముతారు. పండుగలు, జాతరల ద్వారా సామూహికంగా మొక్కులు చెల్లించుకుంటారు.
క్షేత్రపాలకుడు - పవిత్ర భౌగోళిక ప్రాంత సంరక్షకుడు
క్షేత్రపాలకుడు అనే పదానికి అక్షరాలా 'ప్రాంత సంరక్షకుడు' అని అర్థం. ఇది సంస్కృత పదాలైన 'క్షేత్ర' (అంటే ప్రాంతం లేదా క్షేత్రం) 'పాల్' (సంరక్షకుడు) నుంచి వచ్చింది. పవిత్ర ప్రాంతాన్ని, ఆలయం సరిహద్దులను ప్రతికూల శక్తుల నుంచి సురక్షితంగా కాపాడడం ఈయన విధి. ప్రాచీన దేవాలయాల్లో క్షేత్రపాలకుని మందిరాలు ప్రత్యేకంగా ఉంటాయి. దైవత్వం మొదట రక్షిస్తుంది, ఆ తర్వాతే ప్రవేశానికి అనుమతిస్తుందని చెప్తుంటారు.
అగరుబత్తీలు వెలిగించడం, ఆవనూనె సమర్పించడంతో పాటు ఆలయం లోపలికి వెళ్లే ముందు మందిర ప్రవేశద్వారం వద్ద ఉండే ద్వార పాలకులు, క్షేత్రపాలకులకు నమస్కరించాలి.