కార్తీకమాసం కొనసాగుతుంది. హిందువులు ఉదయం, సాయంత్రం ఇంట్లో తులసికోట దగ్గర, గుమ్మాల దగ్గర, దేవుడి మందిరం వద్ద దీపారాధన చేస్తారు. సాధారణంగా దేవుడి దగ్గర లేదా తులసికోట దగ్గర నిత్యం దీపం వెలిగించినా, కార్తీకమాసంలో మాత్రం గుమ్మాల రెండు వైపులా కూడా దీపాలు పెడతారు.
కార్తీక మాసంలో వెలిగించే దీపాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు. ఇది మనసును వెలిగించి నిండు సంతోషాన్ని కలిగిస్తుంది. మంచి గుణాలను ప్రసాదించే పవిత్ర దీపంగా దీన్ని చూస్తారు. దీపం వెలిగించడం అంటే మనిషిలోని చెడు గుణాలను తొలగించి జ్ఞానం అనే మంచి స్వభావాన్ని నింపుకోవడమేనని పెద్దలు చెబుతారు.
పంచభూతాలలో అగ్నికి విశిష్టమైన స్థానం ఉంది. వేదాల్లో అగ్నిని యజ్ఞఫలాలను దేవతలకు తీసుకెళ్లే వాహనంగా వర్ణించారు. ప్రాణికోటికి తేజస్సు అగ్నిద్వారానే లభిస్తుంది. అలాంటి అగ్ని నివసించే దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదు. మొదట అగరువత్తితో దీపం వెలిగించి, ఆ తర్వాత ఒక దీపంతో మిగిలిన దీపాలను వెలిగించాలి. కనీసం రెండు వత్తులు లేకుండా దీపారాధన చేయకూడదని పండితులు సూచిస్తున్నారు.
ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠమని భక్తుల నమ్మకం. వాడే నూనెను బట్టి ఫలితాలు మారుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆవునెయ్యిలో రెండు చుక్కలు వేపనూనె కలిపి దీపం వెలిగిస్తే విజయం లభిస్తుంది. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. నువ్వుల నూనె దేవతలకు ప్రియమైనది. దీపపు ప్రమిదలో శివుడు, వెలుగులో సరస్వతి, లక్ష్మీదేవి నివసిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి.