అన్నమయ్య కీర్తన కొండలలో నెలకొన్న /Annamayya Keerthana

 కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

కొండలంత వరములు గుప్పెడు వాడు ‖

కుమ్మర దాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు |
దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ‖

అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారుకి
ముచ్చిలి వెట్టికి మన్ని మోసినవాడు |
మచ్చిక దొలక తిరునంబి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు ‖

కంచిలోన నుండు దిరుకచ్చినంబి మీద గరు-
ణించి తన యెడకు రప్పించిన వాడు |
యెంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించిన వాడు ‖

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow