🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️
స్త్రీ చేతిలో మరణాన్ని నీవే కోరుకున్నావుగనక ఈ దివ్యాంగనను ముందర నిలిపి వాళ్లందరూ ప్రచ్ఛన్నంగా నిలిచి నిన్ను బందీని చేయజూస్తున్నట్లున్నారు. అందుకే నీవు అప్పుడే వెళ్లకు. ముందు మన సైన్యంలోని చిక్షుర, తామ్రాక్షులు, అసిలోమ, బిడాలాక్షులు మొదలైన వారిని పంపు. వాళ్లు ఆమెను ఓడించి తీసుకురాగలరని నా నమ్మకం.
ఆమె మాటలు సమంజసంగా తోచడంతో మహిషుడు తన ప్రధాన సేనాధిపతులను యుద్ధానికి పంపించాడు. వారందరూ దేవి చేతిలో మరణించడంతో కోపావేశంతో తానే యుద్ధభూమికి బయలుదేరాడు.
"సుందర రూపంతో నన్ను వివశుడిని చేసిన నీకు నా అభివాదనలు! కాంతామణి! నాతో యుద్ధం చేయవద్దు. నన్ను వరించి నా రాణివై ఆనందాన్ని ప్రసాదించు!"
ఆ మాటలకు దేవీమాత చిరునవ్వు నవ్వింది.
"మహిషాసురా! సహజంగా మహిషుడివైన నీ పశు ప్రవృత్తికి తగినట్లే ఘోరరూపంతో నిన్ను సంహరిస్తాను. సిద్ధంగా ఉండు!"
అని శంఖం పూరించింది. మహిషాసురుడు అనేక రూపాలు ధరించి యుద్ధం చేసినా చివరకు జగదంబ త్రిశూలంతో అతని తలను ఖండించింది. బాణాలతో అతని ప్రాణాలను హరించింది.
మహిషాసురుడు మరణించగానే రాక్షసులు పారిపోయారు. దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ దేవీమాతను స్తుతించారు.
అయిగిరి నందిని నందిత మోదిని...
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే!
మహిషాసురుని సంహరించి లోకాలలో శాంతిని స్థాపించిన దేవీమాతకు దేవతలు నమస్కరించి స్వర్గానికి తిరిగి వెళ్లారు.
సూత మహర్షి ఇలా చెప్పాడు...
"ఆశ్వయుజ శుక్ల అష్టమినాడు మహిషాసుర మర్దినిగా దేవీమాతను పూజించినవారికి సర్వశుభాలు కలుగుతాయి. పాడ్యమి నుండి నవమి వరకు దేవీ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహించినవారిపై అమ్మవారి కటాక్షం ఉంటుంది."
"శివే భవాని ప్రమదౌ షడాననే! మృడాని దుర్గే వరదే మహేశ్వరి! చిదగ్ని కుండాంతర సంభవేంబికే! ప్రయచ్ఛమే మంగళమంబ సత్వరం!"
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏