🕉 శివమహాపురాణం 🕉
‘‘పిచ్చిదానా! సంతానం మోక్షసాధనకు అవరోధమని గ్రహించే భగవంతుడు మనకా బంధాలను అనుగ్రహించలేదు. భార్యా, పిల్లలు అనే సంసార బంధాలలో కూరుకుపోవడం నాకు ఇష్టం లేదు. ఈ జన్మకు ఇంతవరకు మనం సాగించిన ఈ గృహస్థాశ్రమం మీద నాకు విరక్తి కలిగింది.
ఐహిక సుఖాలు శాశ్వతం కావు. యవ్వనం క్షణభంగురమైనది. వయస్సు పెరుగుతున్నకొద్దీ మనస్సు నిలకడపొంది, ఐహిక సుఖాలవైపు కాక శాశ్వతమైన మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించాలి.
అందుకే నీవు కూడా నాతో వైరాగ్య మార్గాన్ని అనుసరించు. ఇద్దరం తపస్సుకు తరలి వెళదాం.’’ అని దత్తుడు శాంత స్వరంతో నచ్చచెబుతూ అన్నాడు.
‘‘ఊహూ! మీ మాటలు నాకెంత మాత్రం సమ్మతం కావు నాధా! భార్య కోరిక తీర్చి ఆమెను సంతోషపెట్టాల్సిన బాధ్యత భర్తదన్న విషయం మర్చిపోతున్నారు మీరు.
నా తనివితీరి తృప్తి చెందేవరకు నన్ను మీరు సుఖాలలో ఓలలాడించక తప్పదు!’’ అంటూ భర్తను గట్టిగా పెనవేసుకుంది లీలావతి.
దత్తుడు నిర్వికారంగా ఆమెను జరిపి లేచి నిలబడ్డాడు.
‘‘భర్త అడుగుజాడలలో నడవడం ఉత్తమ సతీధర్మం. నా నిర్ణయం మారదు. నేను తపస్సుకు తరలి వెళుతున్నాను. నా మార్గానికి అడ్డురాకు.’’ అన్నాడు.
‘‘మిమ్మల్ని నేను వెళ్లనివ్వను. ఇంతకాలం మీ ప్రేమానురాగాలలో పరవశిస్తూ ప్రేమసామ్రాజ్యాన్ని పట్టమహిషిలా పాలిస్తూ వచ్చాను.
నా ఆనందాన్ని భంగపరిచి మీరెలా వెళతారో చూస్తాను!’’
అని భర్తలో కోరిక కలిగించాలన్న ఉద్దేశంతో అతడిని గట్టిగా కౌగిలించుకుంది లీలావతి.
⚡ శాప ఘట్టం ⚡
‘‘లీలావతి! ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా పశువాంఛతో నా మార్గానికి అడ్డుపడుతున్న నీవు ఉత్తమ స్త్రీ జన్మకు తగవు.
మరుజన్మలో రాక్షసకులంలో మహిషిగా జన్మించి నీ పశువాంఛను తీర్చుకో!’’
అంటూ దత్తుడు ఆమెను శపించాడు.
లీలావతి కళ్లు ఎరుపెక్కాయి.
‘‘నాది పశువాంఛనా? నేను మహిషిగా జన్మిస్తానా?
అయితే నా మాట కూడా వినండి. మహిషినైనా మిమ్మల్ని విడువను. ఆ జన్మలో కూడా మహిషంగా వచ్చి మీరే నన్ను సంతోషపెడతారు.
వెళ్లండి... వెళ్లి తపస్సుతో ఏం సాధించుకుంటారో అదీ చూస్తాను!’’
దత్తుడు మనసులో పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు.
‘‘పరమేశ్వరా! మీరు స్వప్నంలో ఆదేశించినట్లు తపస్సుకు వెళ్లాలనుకుంటే లీలావతి ఈ విధంగా ప్రవర్తిస్తుందనుకోలేదు. ఆమెకు సద్బుద్ధిని అనుగ్రహించండి.’’
అని ప్రార్థించి అక్కడి నుండి వెళ్లిపోయాడు.
భర్త వెళ్లిపోవడం చూసిన లీలావతి తీవ్ర దుఃఖంతో ప్రాణత్యాగం చేసింది.
🕉 ఓంకార స్తుతి 🕉
ఓంకారం బిందు సంయుక్తం
నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం చైవ
ఓంకారాయ నమో నమః
ఓం నమశ్శివాయ!
ఓం నమశ్శివాయ!
పంచాక్షరీ మంత్రాన్ని ధ్యానిస్తూ నారదుడు కైలాసంలో అడుగుపెట్టాడు.
వెండికొండపై కొలువై ఉన్న పార్వతీ పరమేశ్వరులకు ప్రమథగణాలు హారతులిస్తూ స్తుతులు గానం చేస్తున్న ఆ దివ్య దృశ్యాన్ని దర్శించి భక్తిపారవశ్యంలో మునిగిపోయాడు.