Karthika Puranam – Chapter 19
Karthika Puranam Chapter 19 : పరమ పావనమైన కార్తిక మాసంలో కార్తిక పురాణం పంతొమ్మిదవ అధ్యాయంలో శ్రీమన్నారాయణుడు నైమిశారణ్యంలో మహర్షులను ఏ విధంగా అనుగ్రహించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీహరిని స్తుతించిన జ్ఞానసిద్ధుడు – వశిష్ఠుడి జనకునితో నైమిశారణ్యమునకు శ్రీహరి వెళ్లడం దగ్గర ఆపిన కథను తిరిగి ప్రారంభిస్తూ ఈ విధంగా చెప్పసాగాడు. నైమిశారణ్యమున ఉన్న మహామునులందరు శ్రీహరిని అనేక రకములుగా స్తోత్రం చేసిన తరువాత ఆ మునులలో ‘జ్ఞానసిద్ధుడను’ ఒక మహాయోగి ఇలా ప్రార్థించాడు.
“ఓ దీనబాంధవా! మాధవా! నీకివే మా నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవైన నీకు స్వాగతం. నీ దర్శన భాగ్యము వలన మేమందరం తరించాము. మా ఆశ్రమములు నీ పాదస్పర్శతో పవిత్రములైనవి. ఓ శ్రీహరి! మేము ఈ సంసార బంధముల నుండి బయట పడలేక కొట్టుకుంటున్నాము. మమ్మల్ని ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రములు చదివినా నీ దివ్యదర్శనం దొరకదు. నీ భక్తులకు మాత్రమే నీ దర్శన భాగ్యం కలుగుతుంది. ఓ ఉపేంద్రా! హృషీకేశా! మమ్మల్ని కాపాడు.” అని మైమరచి స్తోత్రం చేసాడు.
జ్ఞానసిద్ధుని అనుగ్రహించిన శ్రీహరి
అంతట శ్రీహరి చిరునవ్వు నవ్వి “ఓ జ్ఞానసిద్ధా! నీ స్తోత్రమునకు నేనెంతో సంతసించాను. నీకు ఇష్టమొచ్చిన వరము కోరుకొమ్మని” చెప్పెను. అప్పుడు జ్ఞానసిద్ధుడు ఇలా ప్రార్థించాడు:
“ఓ నారాయణా! నేను ఈ సంసారసాగరం నుంచి విముక్తుడిని కాలేకపోతున్నాను. కావున ఎల్లప్పుడూ నా ధ్యానము నీ పాదపద్మములపై ఉండునట్లుగా నన్ను అనుగ్రహింపుము.”
అప్పుడు శ్రీమన్నారాయణుడు కరుణతో ఇలా చెప్పెను: “ఓ జ్ఞానసిద్ధుడా! నీ కోరిక ప్రకారమే నీకు వరము ఇస్తున్నాను. అంతేకాక నీపైన దయతో నీకు మరొక వరమును కూడా ఇస్తున్నాను.”
చాతుర్మాసం మహత్యం
శ్రీహరి ఇలా చెప్పసాగాడు: “ఈ లోకమున మానవులు దురాచారులై అనేక పాపకర్మములు చేస్తున్నారు. అటువంటి వారి పాపములు పోవడానికి నేను ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సకలజనులు ఆచరించవచ్చును.
నేను ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున లక్ష్మీదేవితో కలిసి పాలసముద్రం పై శేషపాన్పుపై పవళిస్తాను. తిరిగి కార్తిక శుద్ధ ద్వాదశి రోజున యోగనిద్ర నుండి మేల్కొంటాను. కాబట్టి ఈ నాలుగు నెలలను చాతుర్మాసమని అంటారు.
ఈ చాతుర్మాసంలో ఆచరించు చాతుర్మాస వ్రతము నాకెంతో ప్రీతికరము. ఈ వ్రతమును భక్తిశ్రద్ధలతో ఆచరించిన వారి పాపములు పోయి, మరణానంతరం నా సన్నిధికి చేరుకుంటారు.
ఈ వ్రతమునకు నియమాలు ఇలా ఉన్నాయి:
- మొదటి మాసంలో – కూరలు భుజించరాదు
- రెండవ మాసంలో – పెరుగు భుజించరాదు
- మూడవ మాసంలో – పాలు భుజించరాదు
- నాలుగవ మాసంలో – పప్పుదినుసులు భుజించరాదు
నా భక్తుల నిగ్రహం, నిష్ఠ మరియు నాయందు ఉన్న భక్తిని పరీక్షించడానికి నేను యోగనిద్రలో ఉండి వారికి ఈ నియమాలను విధించాను.
ఇలా భక్తిశ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించిన వారు జరావ్యాధుల భయము నుండి విముక్తులవుతారు.
అని చెప్పి శ్రీమన్నారాయణుడు శ్రీమహాలక్ష్మితో కలిసి పాలసముద్రమునకు వెళ్లి శేషపాన్పుపై పవళించాడు.
వశిష్ఠుడు జనకమహారాజుతో ఇలా చెప్పాడు: “ఓ రాజా! ఈ విధంగా శ్రీహరి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రతమహాత్మ్యమును గురించి ఉపదేశించాడు. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు చెప్పాడు. నేను నీకు వివరించాను.”
అప్పటినుండి శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునులందరూ చాతుర్మాస వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠమునకు చేరారు.
ఇతి స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే ఏకోనవింశాధ్యాయ సమాప్తః ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు మరియు వివిధ శాస్త్రాలలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా పాఠకుల వ్యక్తిగత నిర్ణయం.