కన్య సంక్రమణం- పితృ దేవతలకు ప్రీతికరమైన ఈ సంక్రమణం విశేషాలు ఇవే!
Kanya Sankranti 2026 : సూర్యుని రాశి మార్పుతో ఏర్పడే సంక్రమణం. సింహ రాశి నుంచి కన్య రాశిలోకి ప్రవేశించనున్న సూర్యభగవానుడు. పితృ దేవతలకు ప్రీతికరం సంక్రమణం. కన్య సంక్రమణం రోజు చేసే సూర్య ఆరాధనతో విజయ సిద్ధి.
సంక్రమణం అంటే?
సంక్రమణం లేదా సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడం లేదా మారడం అని అర్థం. ఒక సంవత్సర కాలంలో సూర్యుడు ద్వాదశ రాశులలో సంచరిస్తాడు. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతున్న ఆ సమయాన్నే సంక్రమణం అంటారు.
ఏడాదిలో 12 సంక్రాంతులు
సూర్యుడు ప్రతి నెలా ఒక రాశిలోకి మారుతాడు కాబట్టి, సంవత్సరానికి 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశి పేరుతో సంక్రాంతి ఏర్పడుతుంది.
కన్య సంక్రమణం విశిష్టత
సూర్యుడు సింహ రాశి నుంచి కన్య రాశిలోకి ప్రవేశించే శుభ సమయాన్ని కన్యా సంక్రమణం లేదా కన్యా సంక్రాంతి అంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17, గురువారం ఉదయం 07:58 గంటలకు నిమిషాలకు సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.
మహా పుణ్యకాల ముహూర్తం:
కన్య సంక్రమణం మహా పుణ్యకాలం ఈ రోజు ఉదయం 07:58 నిమిషాల నుంచి ఉదయం 8:13 నిమిషాల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ సమయంలో చేసే నదీ స్నానం, సూర్య ఆరాధన, దానధర్మాలు, పితృదేవతల ఆరాధన సాధారణం కంటే కోటిరెట్ల అధికఫలాన్ని ఇస్తాయని విశ్వాసం.
కన్య సంక్రమణం ఎలా జరుపుకోవాలి?
కన్య సంక్రమణం పవిత్రమైన రోజున భక్తులు నదీస్నానాలు లేదా పుణ్య జలాల్లో స్నానం చేయడం ఆచారంగా వస్తోంది. దీనివల్ల శరీర, మనః శుద్ధితో పాటు జన్మాంతర పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
సూర్య ఆరాధన:
కన్య సంక్రమణం సూర్యుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం సంప్రదాయం. పరమ పవిత్రమైన ఈ రోజు సూర్యోదయం తోనే నిద్ర లేచి నదీస్నానం చేయాలి. అనంతరం ఒక రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో అక్షింతలు, ఎర్రని పూలు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం సూర్యునికి అభిముఖంగా నిలబడి ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. ఈ రోజు సూర్య నమస్కారాలు చేయడం వలన మంచి ఆరోగ్యం, తేజస్సు లభిస్తుందని శాస్త్ర వచనం.
పితృ దేవతల ఆరాధన
పవిత్రమైన కన్య సంక్రమణం రోజు నదీతీరంలో గతించిన పితృ దేవతలకు పిండ ప్రదానాలు, జల, తిల తర్పణాలు విడిచి పెట్టడం వలన వారికి సద్గతులు లభిస్తాయని విశ్వాసం. అంతేకాదు ఈ రోజు బ్రాహ్మణులకు పితృ దేవతల పేరిట దానధర్మాలు చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పితృపక్షాలు గా పిలవబడే మహాలయ పక్షాలలో వచ్చే ఈ కన్యా సంక్రమణం సందర్భంగా చేసే పిండ ప్రదానాలు, దానాలతో పితృ దేవతలు ప్రీతి చెందుతారని శాస్త్రం చెబుతోంది.
జాతకంలో బలపడే సూర్య స్థానం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో సూర్యుడు బలహీనంగా ఉంటే వృత్తి పరంగా అనేక సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కన్యా సంక్రమణం రోజు చేసే స్నాన, దాన, జపాల వలన జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. ఆర్థిక పరమైన, ఆరోగ్య పరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. మరో ముఖ్య విశేషం ఏమిటంటే జాతకంలో సూర్య స్థానం బలంగా ఉంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అందుకే ఈ కన్య సంక్రమణం రోజున చేసే సూర్య ఆరాధన వలన కీర్తి ప్రతిష్టలు కూడా వృద్ధి చెందుతాయి. రానున్న కన్య సంక్రమణం రోజు మనం కూడా సూర్య భగవానుని ఆరాధించి, పితృదేవతలకు తర్పణాలు విడిచి పెడదాం! ఆయురారోగ్య ఐశ్వర్యాలను, వంశాభివృద్ధిని పొందుదాం. ఓం శ్రీ ఆదిత్యాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.