దుర్వాస మహర్షి శాపంతో ధవళ వర్ణాన్ని కోల్పోయిన ఐరావతం- యమధర్మరాజు కూడా ఇక్కడి పవిత్ర తీర్థంలో స్నానం చేసి శివుడిని ఆరాధించడం ద్వారా శాపం నుంచి ఉపశమనం
Airavatesvara Temple Darasuram :
ఇంద్రుని వాహనమైన ఐరావతం దుర్వాస మహర్షి శాపంతో తన తెల్లని వర్ణాన్ని కోల్పోయి, దారాసురంలోని శివుడిని ఆరాధించి శాప విమోచనం పొందిందని స్థల పురాణం చెబుతుంది. శివారాధనతో ఐరావతం శాప విమోచనం పొందిన ఐరావతేశ్వర క్షేత్రం! యమధర్మరాజు సైతం శాపవిమోచనం పొందిన పుణ్య క్షేత్రం! యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఐరావతేశ్వరానికి గుర్తింపు!
ఆలయాల క్షేత్రం కుంభకోణం
తన భక్తులను కష్టాల నుంచి బయట పడేయడానికి శివుడు అనేకసార్లు అనేక చోట్ల వెలిసాడు. అలాంటి ప్రదేశాలు నేడు పుణ్య క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. తమిళనాడులోని కుంభకోణం ఆలయాల నగరంగా గుర్తింపు పొందింది. ఒక్క కుంభకోణంలోనే దాదాపు 2 వేల ఆలయాలు ఉన్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడే ఐరావతేశ్వరం అనే అద్భుత శైవ క్షేత్రం ఉంది. ఇంద్రుని వాహనమైన ఐరావతం, యమధర్మరాజు శాప విమోచనం పొందిన ఈ పుణ్య క్షేత్రం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐరావతేశ్వరం ఎక్కడుంది?
ఐరావతేశ్వర దేవాలయం తమిళనాడులోని తంజావూరు జిల్లా, కుంభకోణం సమీపంలోని దారాసురం అనే పట్టణంలో వెలసి ఉంది. పరమేశ్వరుడు ఇక్కడ ఐరావతేశ్వరుడిగా వెలసి పూజలందుకుంటున్నాడు.
ఆలయ చరిత్ర
కుంభకోణంలో వెలసిన ఐరావతేశ్వరం దేవాలయం 12వ శతాబ్దంలో చోళ రాజు రెండో రాజరాజ చోళులు నిర్మించారు. ఈ అద్భుతమైన ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించింది.
ఆలయ స్థల పురాణం
దేవేంద్రుని వాహనమైన ఐరావతం శ్వేత వర్ణంలో మెరిసి పోతుంటుంది! ఒకసారి దుర్వాస మహర్షికి ఈ ఐరావతం మీద పట్టలేనంత కోపం వచ్చిందట. అంతే! 'ఏ తెలుపు రంగుని చూసుకుని మురిసిపోతున్నావో, ఏ తెలుపు రంగు కారణంగా ఇతరులకంటే అధికుడినని భావిస్తున్నావో ఆ రంగు కోల్పోదువుగాక!' అంటూ శపించాడట. దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం నుంచి విమోచనం పొందేందుకు ఆ దేవ గజం ఎన్ని చోట్ల తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ధరాసురంలోని పరమేశ్వరుని పూజించుకొని, అక్కడ ఉన్న కొలనులో స్నానం చేయగానే ఐరావతానికి తన శ్వేత వర్ణం తిరిగి వచ్చేసింది. ఈ గాథకు ప్రామాణికంగా ఆలయంలో ఇంద్రునితో సహా వేంచేసి ఉన్న ఐరావతం కనిపిస్తుంది. ఇంద్రుని ఐరావతానికి శాప విమోచనం కలిగించిన కారణంగా ఇక్కడ పరమేశ్వరుడు ఐరావతేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.
యమ తీర్థం
ఆలయ ప్రాంగణంలో వెలసి ఉన్న కోనేరును యమ తీర్ధంగా పిలుస్తారు. దీని వెనుక కూడా ఓ గాథ ఉంది. పూర్వం యమధర్మరాజు చేసిన ఒక పొరపాటు కారణంగా ఆయనకు తన శరీరమంతా మండుతున్నట్లుగా అవుతుంది. అప్పుడు ఆయన ఈ ఐరావతేశ్వర క్షేత్రానికి వచ్చి ఇక్కడి కోనేటిలో స్నానం చేసి ఐరావతేశ్వరుని పూజించగా శాపం నుంచి ఉపశమనం పొందినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ కోనేరు, స్వచ్ఛమైన కావేరీ జలాలతో నించి ఉంటుంది. ఆనాటి నుంచి ఈ కోనేరు 'యమ తీర్థం'గా ప్రసిద్ధి చెందింది.
ఆలయ విశేషాలు
ఐరావతేశ్వర ఆలయం కళా, వాస్తు సంపదకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో అద్భుతమైన రాతి శిల్పాలు ఉన్నాయి. అత్యద్భుతమైన శిల్పాల సూక్ష్మత, కళాత్మకతలో విశిష్టమైనది. గర్భాలయానికి ముందు ఉన్న మండపాన్ని తిరు మండపం అంటారు. రథం ఆకారంలో ఉండే ఈ మండపం కోణార్క సూర్య దేవాలయం నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. గర్భాలయంలో ఐరావతేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ మరో ప్రత్యేక ఆలయంలో పార్వతీదేవి పెరియ నాయకి అమ్మన్‌గా కొలువై ఉంది.
ఇతర ఉపాలయాలు
అద్భుతమైన రాతి కట్టడంతో అలరారే ఈ ఆలయంలో ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయుదేవుడు, బ్రహ్మ, సూర్యుడు, విష్ణువు, సప్తమాతృకలు, దుర్గాదేవి, సరస్వతి, లక్ష్మీదేవి, గంగాదేవి, యమున, సుబ్రహ్మణ్యస్వామి, గణేశుడు, మన్మథుడు, రతీదేవి తదితర దేవి దేవతలు ఆలయాలున్నాయి.
సప్త మాతృకలు ఆలయాలు
ఐరావతేశ్వర ఆలయంలో గర్భాలయానికి నైరుతి మూలలో నాలుగు ఉపాలయాలతో ఒక మండపం కలదు. ఈ మండపంలో ఒకదానిలో యముని విగ్రహం ఉంది. ఈ ఉపాలయానికి సమీపంలో సప్తమాతృకల విగ్రహాలు చెక్కిన పెద్ద రాతి పలకలను దర్శించుకోవచ్చు.
పూజోత్సవాలు
ఐరావతేశ్వర దేవాలయంలో ప్రతి రోజు జరిగే నిత్యపూజలతో పాటు ప్రతి సంవత్సరం మాఘ మాసంలో మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు, జాతర జరుగుతుంది. ఈ సందర్భంగా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.
సంగీత మెట్లు
గర్భాలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మండపానికి చేరుకోవడానికి ఏర్పాటు చేసిన రాతి మెట్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ మెట్లపై నడిచినా లేదా మెట్లను చేతితో తట్టినా సప్తస్వరాలైన "స-రి-గ-మ-ప-ద-ని" ధ్వనులు వినబడతాయి. సైన్స్‌కు సైతం అందని చోళుల శిల్పకళా చాతుర్యానికి ఇది ఒక నిదర్శనం. అందుకే ఈ మెట్లను "గాన మెట్లు" అని పిలుస్తారు.
ఎలా చేరుకోవాలి?
కుంభకోణం నగరానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ఆలయానికి కుంభకోణం నగరం నుంచి మెరుగైన రవాణా సదుపాయాలున్నాయి. ఐరావతేశ్వర ఆలయాన్ని సందర్శించి ఐరావతేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోల్పోయిన ఐశ్వర్యం తిరిగి సిద్ధిస్తుందని విశ్వాసం. మనం కూడా ఐరావతేశ్వర ఆలయాన్ని దర్శించి ఐశ్వర్యసిద్ధిని పొందుదాం.
ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక :
పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.