వినాయక చవితి పూజా విధానం: ఇంటి పూజ నుంచి నైవేద్యం వరకు పూర్తి వివరాలు
అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వినాయక చవితి వచ్చేసింది. హిందూ సంప్రదాయంలో మిగిలిన పండుగలన్నీ ఒక ఎత్తైతే, వినాయకుని పండుగ ఒక ఎత్తు. గణేశుని ఎంపిక నుంచి, నివేదించే పదార్థాల వరకు కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. ఈ కథనంలో ఆ వివరాలన్నీ తెలుసుకుందాం.
🐘 వినాయకుని విగ్రహం కొనేముందు ఈ జాగ్రత్త తప్పనిసరి!
ముందుగా ఇంట్లో ప్రతిష్టించుకునే గణపతిని ఎలా ఎంపిక చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో పూజించుకునే వినాయకునికి తొండం ఎడమవైపునకు ఉండేలా చూసుకోవాలి. ఈ గణపతిని 'వామముఖ గణపతి' అంటారు. సాధారణంగా వామముఖ గణపతి శాంత స్వరూపుడు. ఈయన సాధారణ పూజకు సులభంగా ప్రసన్నుడవుతాడు. గృహస్థులు పూజించడానికి వామముఖ గణపతి శ్రేష్టమైనది. ఈ గణపతి ఆరాధన వలన సుఖశాంతులు వృద్ధి చెందుతాయి.
🪔 వినాయకుని పూజకు ఇలా సిద్ధమవుదాం!
వినాయకుని ఎంపిక పూర్తయిన తర్వాత ఇతర పూజా సామగ్రి కూడా ముందురోజే కొని సిద్ధం చేసుకోవాలి. పండుగ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటిముందు రంగవల్లికలు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మాలను మామిడి ఆకులతో, పుష్ప మాలికలతో అలంకరించాలి.
పూజామందిరంలో ఈశాన్య దిశలో మండపాన్ని ఏర్పాటు చేసి, ఈ మండపం పైన పాలవెల్లి అమర్చి, నలువైపులా అరటి పిలకలతో, రకరకాల పళ్లు పూలతో అలంకరించాలి. ఇప్పుడు మండపం మధ్యలో పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టిన పీటను ఉంచి, దానిపై ధాన్యాన్ని పోసి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
🕉️ శుభ సమయంలో గణపతి ప్రాణ ప్రతిష్ట
పూజకు అవసరమైన సకలం సిద్ధం చేసుకుని, నైవేద్యాలు కూడా తయారు చేసుకున్న అనంతరం పూజ ప్రారంభించాలి. ముందుగా దీపారాధన చేసి, పండితులు నిర్దేశించిన సుముహూర్తంలో గణపతి ప్రాణ ప్రతిష్ట చేయాలి. ముందుగా పసుపు గణపతిని షోడశ నామాలతో పూజించి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి.
📜 వినాయక వ్రతకల్పం
ముందుగా వినాయకుని మనం ఏర్పాటు చేసుకున్న మండపంలోకి ఆవాహన చేసి, అర్ఘ్యం, పాద్యం సమర్పించి, పంచామృతాలతో అభిషేకించి వస్త్రోత్తరీయాలను, యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. తరువాత అష్టాంగ పూజ చేసి, అష్టోత్తర శతనామాలతో పూజించాలి. అనంతరం 21 రకాల పత్రాలతో పత్రి పూజ చేయాలి. తరువాత ధూపదీప దర్శనం చేయించి మహా నైవేద్యం సమర్పించాలి.
🍛 గణనాథుని నైవేద్యంలో ఈ పొరపాట్లు వద్దు
వినాయకుని పూజకు నియమనిష్టలు ప్రధానం. వినాయకునికి ప్రధానంగా 3, 5, 9, 11, లేదా 21 రకాల నైవేద్యాలు సమర్పించాలని వినాయక వ్రతకల్పంలో వివరించి ఉంది.
ఈ పర్వదినం రోజు పులిహోర, పరమాన్నం, గారెలు, బూరెలు, ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలు వంటి పిండి వంటలతో పాటు పప్పు, కూరలు, పులుసు, పచ్చళ్లు, పెరుగు వంటి సంప్రదాయక వంటకాలతో మహా నైవేద్యం సమర్పించాలి. అలాగే కొబ్బరికాయ కొట్టి అరటి పండ్లు కూడా నివేదించాలి. నైవేద్యం తరువాత వినాయకునికి దక్షిణ తాంబూలాలు సమర్పించి మంగళ హారతులు ఇచ్చి నమస్కరించుకోవాలి.
⚠️ ఈ నియమాలు తప్పనిసరి
వినాయక చవితి పూజ నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్న తరువాత వినాయక చవితి వ్రత కథను కూడా తప్పకుండా చదువుకోవాలి. ఈ కథ చదువుకుని శిరస్సున పూజాక్షింతలు వేసుకుంటే చవితి చంద్రుని దర్శించిన దోషం పోతుందని వ్రత కథలో వివరించి ఉంది.
- సాయంత్రం బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి కనీసం ఐదుగురు వినాయకులను దర్శించడం శుభప్రదం.
- పురాణాల ప్రకారం వినాయక చవితి రోజున పొరపాటున కూడా రాత్రి వేళ చంద్రుడిని చూడకూడదు. ఒకవేళ చూస్తే చేయని తప్పులకు నిందలు పడాల్సి వస్తుంది. (దోష నివారణకు వ్రత కథ చదివి శిరస్సున అక్షింతలు వేసుకోవాలి).
- ఈ రోజున కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.
- ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి నిషేధం!
- మద్యం, మాంసాహారం పూర్తిగా నిషిద్ధం.
- ఈ పవిత్ర దినాన బ్రహ్మచర్యం పాటించాలి.
మనం కూడా ఈ నియమాలు పాటిస్తూ ఈ వినాయక చవితి పండుగను ఆనందంగా జరుపుకుందాం. గణనాథుని అనుగ్రహంతో ఆరోగ్య ఐశ్వర్యాలు పొందుదాం.