'కాలసర్ప దోషాలు' ఎన్ని రకాలు? - వివాహపరమైన సమస్యలకు కారణం ఏంటి?

Kala Sarpa Dosha Remedies

'కాలసర్ప దోషం' అంటే భయపడాల్సిన అవసరం లేదు! - ఈ పరిహారాలతో తీవ్రత తగ్గించుకోవచ్చంటున్న జ్యోతిష్యులు!

Kala Sarpa Dosha Remedies: చాలా మందిలో జాతకంలో 'సర్పదోషం లేదా కాలసర్ప దోషం' ఉందనగానే ఏదో తెలియని ఆందోళన భయపెడుతుంది. జీవితంలో ఏది జరిగినా దానికి ఆ దోషమే కారణంగా భావిస్తుంటారు. కానీ, ఈ దోషం ఉన్న ప్రతి ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు జ్యోతిష్య పండితులు డా.శంకరమంచి శివ సిద్ధాంతి. కొన్ని పరిహారాలు పాటిస్తే దీన్ని సులభంగా జయించవచ్చంటున్నారు.

కాలసర్ప దోషం అనేది శాస్త్రీయంగా చూస్తే ముఖ్యంగా మానసిక దుర్బలత్వాన్ని సూచిస్తుంది. గ్రహాల పరంగా చూస్తే రాహువు దురాశకు, కేతువు నిరాశకు ప్రతీకలుగా చెబుతారు. ఈ దోషం ఉన్నవారు తరచూ చంచలత్వానికి గురికావడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుందంటున్నారు జ్యోతిష్యులు శంకరమంచి శివ సిద్ధాంతి. ఇకపోతే కాలసర్ప యోగాన్ని జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రధానంగా రెండు విధాలుగా వర్గీకరించవచ్చంటున్నారు.

సవ్య కాలసర్ప యోగం అంటే?

'అగ్రే రాహు రథౌకేతుః మధ్యే షడ్గ్రహౌ తథా|
యది కాలసర్పాఖ్య యోగాయా నృపరాష్ట్ర వినాశనం||'

వివరణ: లగ్నంలో రాహువు, సప్తమంలో(ఏడో స్థానంలో) కేతువు ఉండి, మిగిలిన ఏడు గ్రహాలు 1 నుంచి 7 స్థానాల మధ్యలో బందీలై ఉంటే దానిని సవ్య కాలసర్ప యోగంగా చెబుతారు. మేషం నుంచి తుల వరకు గల రాశులలో రాహువు ఉండగా, మిగిలిన రాశులలో కేతువు ఉన్న టైమ్‌లో ఈ దోషం ఏర్పడుతుందని పైన పేర్కొన్న శ్లోకం తెలియజేస్తోంది.

అపసవ్య కాలసర్ప యోగం అంటే?

'అగ్రే కేతుః రథౌ రాహు గర్భస్తే సప్తకే తథా|
యది అపసవ్యకాల సర్పాఖ్య దోషయం నృపాణం సమరం భవేత్ ||'

వివరణ: కేతువు లగ్నంలో, రాహువు ఏడో స్థానంలో ఉండి, మిగిలిన సప్త గ్రహాలు ఈ రెండింటి మధ్య (1 నుంచి 7 మధ్యలో) ఉంటే అది అపసవ్య కాలసర్ప యోగం అవుతుందని ఈ శ్లోకం వివరిస్తోంది.

దోషం ఉన్నా శుభ ఫలితాలిచ్చే స్థానాలు

  • కాలసర్ప యోగం ఉన్నంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు అంటున్నారు జ్యోతిష్యులు శంకరమంచి శివ సిద్ధాంతి. కింది పేర్కొన్న స్థానాలలో గ్రహాలుంటే ఆ దోష ప్రభావం పూర్తిగా తొలగిపోయి సత్ఫలితాలిస్తాయని చెబుతున్నారు.
  • వృషభ రాశిలో రాహువు ఉన్నా, వృశ్చిక రాశిలో(ఉచ్చ స్థానాలు) కేతువు ఉన్నా దోషం ఉండదంటున్నారు.
  • రాహు, కేతువులు వారి స్వక్షేత్రాలు, మూల త్రికోణాలు అయిన కర్కాటకం, మిథునం, ధనుస్సు, కన్య, మీనం వంటి రాశులలో ఉన్నా దోష ప్రభావం తొలగిపోతుందంటున్నారు.
📖 నవగ్రహ దోషాలతో ఇబ్బంది పడుతున్నారా? - 'పురటాసి మాసం'లో ఈ టెంపుల్స్‌కు వెళ్లండి!

కాలసర్ప దోషాలు - వాటి ప్రభావాలిలా (12 రకాలు)

వ్యక్తిగత జాతక చక్రాన్ని బట్టి ఈ కాలసర్ప దోషం 12 రకాలుగా ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు శంకరమంచి శివ సిద్ధాంతి.

1. అనంత కాలసర్పదోషం

లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు ఉన్న టైమ్‌లో ఈ దోషం ఏర్పడుతుంది. శారీరక, మానసిక సమస్యలు దీని వల్ల ఎదురవుతాయి. దేనిపైనా సరైన లక్ష్యం ఉండదు. నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతుంటారు.

2. గుళిక కాలసర్పదోషం

రెండో స్థానంలో రాహువు, 8లో కేతువు ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. దీని వల్ల ఆర్థిక, కుటుంబ సమస్యలు వస్తాయి. ఇతరులకు సహాయం చేసి మొహమాటం వల్ల చివరకు తామే నష్టపోతారు.

3. వాసుకి కాలసర్పదోషం

రాహువు 3లో, కేతువు 9లో ఉంటే అది వాసుకి కాలసర్పదోషం. దీని కారణంగా మానసిక దుర్బలత్వం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారిని నమ్మలేరు, అలాగే ఇతరుల నమ్మకాన్నీ కోల్పోతారు.

4. శంఖపాల కాలసర్పదోషం

రాహువు 4లో, 10లో కేతువు ఉంటే అది ఈ రకం కాలసర్ప దోషం. దీని వల్ల విద్యాభ్యాసంలో ప్రాథమికంగా అనేక ఇబ్బందులు వస్తాయి. చెడు సహవాసాలకు లోనయ్యే ఛాన్స్ ఉంటుంది. వాహన ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం.

5. పద్మ కాలసర్పదోషం

రాహువు 5లో, 11లో కేతువు ఉంటే అది ఈ రకమైన దోషం. దీని వల్ల ఆలోచనలు పక్కదోవ పడతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరలేని పరిస్థితి ఉంటుంది. మిత్రుల సహవాసం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది.

6. మహాపద్మ కాలసర్పదోషం

రాహువు 6లో, 12లో కేతువు ఉంటే అది మహాపద్మ కాలసర్పదోషం. శత్రువులు, రోగాలు, అప్పులు(రుణాలు) పెరగకుండా జాగ్రత్తపడాలి. వ్యసనాలకు బానిస కాకుండా నియంత్రణ అవసరం.

7. తక్షక కాలసర్పదోషం

రాహువు 7లో, లగ్నంలో కేతువు ఉంటే అది ఈ రకం దోషం. దీనివల్ల వివాహపరమైన సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అశాంతి, విభేదాలు ఏర్పడతాయి.

8. కర్కోటక కాలసర్పదోషం

రాహువు 8లో, కేతువు రెండో స్థానంలో ఉంటే అది ఇలాంటి దోషం. దీని వల్ల తరచుగా ప్రమాదాలకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది. అకారణ కలహాలు, ఆస్తి నష్టాలు సంభవించవచ్చు.

9. శంఖచూడ కాలసర్పదోషం

రాహువు 9లో, 3లో కేతువు ఉంటే అది శంఖచూడ కాలసర్పదోషం. ఈ దోషం కారణంగా ఉన్నత విద్యలో అవరోధాలుంటాయి. వారసత్వ ఆస్తులు కోల్పోయే ప్రమాదం ఉంది. దానధర్మాలను వ్యతిరేకిస్తారు.

10. ఘటక కాలసర్పదోషం

రాహువు 10లో, 4లో కేతువు ఉండడం వల్ల ఈ దోషం ఏర్పడుతుంది. దీని మూలంగా వృత్తి/ఉద్యోగంలో ఒడిదొడుకులు ఎదురవుతుంటాయి. ఎంత కష్టపడి పనిచేసినా పై అధికారుల నుంచి తగిన గుర్తింపు రాదు.

11. విషదాన (విషధర) కాలసర్పదోషం

రాహువు 11లో, కేతువు 5లో ఉంటే అది ఈ రకమైన దోషం. ఇలాంటి దోషం ఉన్నవారికి ఆదాయ మార్గంలో అవరోధాలు ఏర్పడతాయి. పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు రావు, ఓర్పు, సహనం లోపిస్తాయి.

12. శేషనాగ కాలసర్పదోషం

రాహువు 12లో, కేతువు 6లో ఉంటే అది ఈ రకమైన దోషం కిందకు వస్తుంది. ఈ దోషం వల్ల జీవితంపై నిరాశ ఏర్పడుతుంది. ప్రతి పనియందు నిర్లక్ష్య భావన పెరుగుతుంది.

పరిహారాలు - పరిష్కార మార్గాలిలా

  • కాలసర్ప దోషం ఉందని కుంగిపోకుండా, సరైన జీవనశైలిని, దైవచింతనను అలవర్చుకుంటే దీన్ని సులభంగా జయించవచ్చని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు డా.శంకరమంచి శివ సిద్ధాంతి.
  • దైవారాధన: ప్రతికూల ప్రభావాలు తగ్గడానికి రాహు-కేతువులకు శాంతి/పూజలు చేయించుకోవాలంటున్నారు.
  • నిత్యం 'సుబ్రహ్మణ్యాష్టకం' చదవడం వల్ల ఈ దోష తీవ్రత తగ్గి సత్ఫలితాలు కలుగుతాయని సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

#buttons=(Ok, Go it!) #days=(No)

Ok, Go it!
💬 Chat 📢 Follow