మహిషి విజృంభణ – దేవతల ఆందోళన
సంతోషంతో తిరిగి వచ్చి వరగర్వంతో విజృంభించి స్వర్గాన్ని ఆక్రమించింది మహిషి! భూలోకంలో తన శాసనాన్ని అమలు చేసింది.
‘‘ఇప్పటికి నా పగ చల్లారింది! నా సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాను. హ.. హ.. హ..! ఇక మూడు లోకాలలో నన్ను ఎదిరించే వారు లేరు!’’ అంటూ యథేచ్ఛగా విర్రవీగుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేయసాగింది మహిషి.
‘‘తండ్రీ! మీరిచ్చిన వరప్రభావంతో మహిషిలో గర్వాహంకారాలు విజృంభించి ఆమె చేస్తున్న దురాగతాలు హద్దుమీరిపోతున్నాయి. హరిహరులు, జగన్మాత కూడా చూస్తూ వున్నారు గానీ ఆమెను నిర్జించే మార్గం తెలియజేయడం లేదు. ఈ పరిస్థితిలో మీరే మాకు తరుణోపాయం తెలియజేయాలి!’’ అంటూ ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని ఆశ్రయించారు.
వాళ్లవైపు చిరునవ్వుతో చూస్తూ అభయం ప్రసాదించాడు బ్రహ్మదేవుడు.
‘‘దేవతలారా! నిరాశ చెందకండి. ప్రస్తుతం మహిషి తన కఠోర తపస్సుకు ఫలంగా సుఖభోగాలను అనుభవిస్తోంది. ఆమె కోరిక తీరే సమయం దగ్గరపడుతోంది. అయితే ఆ విషయం ఆమెకు తెలియకుండా ఉండేందుకు తాత్కాలికంగా ఆమె దృష్టిని మరల్చే సమర్థుడు రాబోతున్నాడు. అలా చూడండి!’’ అంటూ బ్రహ్మ కళ్లు మూసుకుని ధ్యానించాడు.
దేవతలందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా సుందరదత్తుడు అక్కడకు వచ్చి బ్రహ్మకు నమస్కరించాడు.
‘‘సుందరదత్తా! నీవల్ల కావలసిన దైవకార్యం ఒకటి ఉంది. నీ శాపం వల్ల నీ భార్య లీలావతి మహిషిగా జన్మించి స్వర్గ, మర్త్యలోకాలలో శాంతి భద్రతలను భంగపరుస్తోంది. నీవు వెంటనే సుందర మహిష రూపాన్ని ధరించి ఆమె ఆగడాలను అరికట్టాలి.’’ అని బ్రహ్మ ఆదేశించాడు.
‘‘మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. కానీ విధాతా! మోక్షాన్ని కోరి నేను చేస్తున్న తపస్సుకు విఘ్నం కలగడం నాకు బాధగా ఉంది. ఆమెనుంచి నాకెప్పుడు విముక్తి లభిస్తుందో తెలియజేయండి.’’ అని సుందరదత్తుడు వేడుకున్నాడు.
‘‘దత్తా! నీ తపస్సు భంగమైనందుకు విచారించవద్దు. లీలావతి నీకిచ్చిన ప్రతి శాపాన్ని అనుభవించేవరకు నీ కర్మ పరిహారం కాదు. అందుచేత మహిష రూపంలో ఆమెతో కలిసివున్నా నీ మనస్సు ఇంద్రియాలకు అతీతంగా ముక్తస్థితిలోనే ఉంటుంది. నీ కార్యం పూర్తవగానే నీవు పరమాత్మలో ఐక్యమవుతావు.’’ అని బ్రహ్మదేవుడు సమాధానమిచ్చాడు.
దత్తుడు సుందర మహిష రూపాన్ని పొంది మహిషి నివాసానికి చేరుకున్నాడు. అల్లంత దూరం నుంచే అతడిని చూసిన మహిషిలో ఆనందం పొంగిపోయింది. పరుగెత్తుకుంటూ వచ్చి అతడిని చేరుకుంది. స్వర్గభోగాలు, పరివారాన్ని విడిచి అతడితో కలిసి అడవిలోకి వెళ్లిపోయింది. అక్కడ ఆ జంటను భంగపరిచే వారు ఎవరూ లేకుండా కొన్ని సంవత్సరాలు ఆనందంగా విహరించారు.
నారదుని సందేహం
‘‘మహిషి బెడద తాత్కాలికంగా తీరినా దాని అంతం మాత్రం మీ ఇరువురికి జన్మించే పుత్రుని చేతిలోనే ఉందికదా! ఇద్దరు పురుషులకు పుత్రుడు జన్మించడం ప్రకృతి విరుద్ధం. అలాంటి వరమే కోరింది మహిషి. ఆ అసాధ్యమైన కార్యం ఎలా సాధ్యమవుతుంది? మహిషి మరణం ఎలా సంభవిస్తుంది స్వామీ?’’ అంటూ నారదుడు హరిహరులను ప్రశ్నించాడు.
‘‘అవును స్వామీ! సుందర మహిషంతో ఉన్న మహిషి ఎప్పుడు తిరిగి విజృంభిస్తుందో తెలియదు.’’ అని దేవతలందరూ ఆందోళన వ్యక్తం చేశారు.
🙏🙏🙏🙏🙏