Navratri Pooja Vidhanam 2025
Devi Navratri Pooja Vidhan 2025: దేశవ్యాప్తంగా దుర్గామాతకు అత్యంత ప్రీతికరమైన దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల్లో అమ్మవారి పూజ ఎలా చేయాలి? ఏ విధంగా చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి? అనే విషయాలను జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ వివరించారు.
Navratri Pooja Vidhanam in Telugu: హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రులు అశ్వయుజ మాస శుక్ల పక్షం మొదటి రోజున ప్రారంభమవుతాయి. ఈ ఏడాది నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి.
నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించినా శుభ ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కలశం, శ్రీచక్రం, అమ్మవారి విగ్రహం లేదా ఫోటో ద్వారా కూడా దుర్గాదేవిని ఆరాధించవచ్చు.
కలశ పూజ
నవరాత్రుల్లో కలశం ఏర్పాటు చేసి పూజ చేసే వారు కొన్ని నియమాలు పాటించాలి. ప్రతిరోజు మహా నైవేద్యం సమర్పించడం తప్పనిసరి. అన్నం, పప్పు, కూర లేదా పిండివంటలు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తరువాతే భోజనం చేయాలి.
విగ్రహ పూజ
దుర్గామాత విగ్రహం పెట్టుకుని పూజ చేసే వారు కూడా మహా నైవేద్యం సమర్పించే నియమాన్ని పాటించాలి.
శ్రీచక్ర పూజ
కొంతమంది శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసి పూజ చేస్తారు. అలాంటివారు గురువు ద్వారా "బాల మంత్రం" స్వీకరించి ఉండాలి. ఆ మంత్రంతో శ్రీచక్ర అర్చన చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయని అంటారు.
మంత్రం లేని వారు సాధారణ పూజ కూడా చేయవచ్చు. శ్రీచక్ర ఫోటోకు గంధం, కుంకుమతో పూజ చేసి అమ్మవారి 108 నామాలు చదవవచ్చు.
ఇంట్లో సులభంగా నవరాత్రి పూజ ఎలా చేయాలి
- ఉదయం లేచి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి పూజా మందిరంలో అమ్మవారి ఫోటో ఏర్పాటు చేయాలి.
- లలితా పరమేశ్వరి లేదా రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారి ఫోటో పెట్టుకుని పూజ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
- అష్టోత్తరం లేదా లలితా సహస్రనామం చదవడం మంచిది.
- దీపారాధన చేసి పుష్పాలు, పండ్లు, నైవేద్యం సమర్పించాలి.
- ఫోటో పూజలో మహా నైవేద్యం తప్పనిసరి కాదు. బెల్లం లేదా పొంగలి సమర్పించినా సరిపోతుంది.
- పూజ ముగిసిన తరువాత తప్పనిసరిగా ఉద్వాసన చెప్పాలి.
పూజ చేయలేని వారు దేవీ ఖడ్గమాల స్తోత్రం లేదా దుర్గా సప్తశతి వినినా శుభ ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Note: పై వివరాలు జ్యోతిష్య నిపుణులు మరియు శాస్త్రాలలో పేర్కొన్న అంశాల ఆధారంగా మాత్రమే అందించబడినవి.